
హైదరాబాద్, ఫిబ్రవరి 6, 2026 (విశ్వం న్యూస్) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రావణ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో రాజ్యాంగ నిబద్ధత క్షీణించిందని, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు అధికార పార్టీ అహంకారంతో నిరంకుశంగా సాగుతున్నాయని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో అధికార పక్షం విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంటే, రాష్ట్ర ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని అన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రేక్షకుల్లా మారారని, చట్టం అమలు చేయాల్సిన వారు చేతులు ముడుచుకుని కూర్చున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్కు ప్రజల నుంచి వస్తున్న మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ దాడులు, బెదిరింపులకు దిగుతోందని పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా అలియాబాద్లో మాజీ మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన ఆయన, మంచిర్యాలలో మాజీ మంత్రి హరీష్ రావును ప్రచారం చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. కొదాడలో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేయడం, నామినేషన్ ఉపసంహరణకు బలవంతం చేయడం ప్రజాస్వామ్య హత్యేనని విమర్శించారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషలో మార్పు లేదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అడ్డంకి రేవంత్ రెడ్డేనని ఆరోపిస్తూ, బీసీ సంఘాల ఆందోళనలకు తాను మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే వ్యాఖ్యలను ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.