మూసి తీరాన బస్తీలపై బుల్డోజర్ పాలన: సీఎం రేవంత్‌పై దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు

- Land Acquisition Act–2013కు విరుద్ధంగా ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయని ఆరోపణ
హైదరాబాద్, మార్చి 7 (విశ్వం న్యూస్) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ ప్రజలపై అమానుష చర్యలు చేపట్టి బుల్డోజర్ పాలన నడుపుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గోసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో “మూసి తీరాన బస్తీ పోరాటం” అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
బస్తీ ప్రజల ఇళ్లను చట్టపరమైన ప్రక్రియలు పాటించకుండా కూల్చివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కాకుండా దోపిడీతో కూడిన పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. బస్తీ ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి బస్తీలపై ప్రేమ చూపడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కాంట్రాక్టర్ల బిల్లులకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం… మూసి నది ప్రాజెక్ట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. గాంధీ విగ్రహం పేరుతో దందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం తాళం వేసి ఉంచారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకొచ్చిన Land Acquisition Act–2013 రైతులు, పేదల హక్కులను రక్షించేందుకు రూపొందించబడిందని దాసోజు శ్రవణ్ గుర్తుచేశారు. అయితే అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆ చట్టాన్ని పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ చట్టంపై సరైన అవగాహన లేదని వ్యాఖ్యానించారు.
DPR లేకుండానే ప్రజల ఇళ్లను కూల్చివేయడం ఏ చట్టం ప్రకారమని ప్రశ్నించిన ఆయన, ముందుగా సరైన నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇళ్లను కూల్చివేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని అన్నారు. ఒకవైపు ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వాన్ని బుల్డోజర్ పాలన అంటూ కాంగ్రెస్ విమర్శిస్తుంటే… తెలంగాణలో మాత్రం అదే విధానాన్ని అమలు చేస్తోందని అన్నారు.
మూసి నది ప్రాజెక్ట్ పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని, ఈ ప్రాజెక్టును అదానీ, అంబానీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్ నడిపే ప్రభుత్వానికి ప్రజలే త్వరలో గట్టి సమాధానం చెబుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.