ఉద్యమకారుల గుర్తింపుపై కమిటీ కాదు.. చట్టబద్ధ కమిషన్ కావాలంటూ బీఆర్ఎస్ డిమాండ్

హైదరాబాద్, జూన్ 4 (విశ్వం న్యూస్) : తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల గుర్తింపు ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రహసనంగా మార్చొద్దని బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. సచివాలయంలో జరిగిన సర్వపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వారు, ఉద్యమకారుల సంక్షేమానికి కమిటీలు కాకుండా చట్టబద్ధమైన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు, నెలకు రూ.25 వేల పెన్షన్, ఇంటి స్థలాలు, కేసుల ఉపసంహరణ వంటి హామీలు ఇచ్చి ఇప్పుడు కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉద్యమకారుల కోసం ప్రత్యేక బడ్జెట్‌తో కూడిన కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు అమరవీరుల స్తూపంలోనే కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని “తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు”గా గుర్తించి ప్రభుత్వ కార్యక్రమాల్లో గౌరవం కల్పించాలని కోరారు. అలాగే ఉద్యమకారులపై నమోదైన పాత కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని, పోలీసు హింసకు గురైన వారికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉద్యమకారుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు వరకు తమ ప్రశ్నలు ఆగవని శ్రవణ్ దాసోజు, కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు.