

- తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
- దశాబ్దకాల పోరాటానికి ఫలితం – ఉద్యోగుల్లో ఆనందోత్సాహం
- రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంతో వాణిజ్య పన్నుల శాఖలో సంబరాలు
- టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకున్న ఉద్యోగులు – రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లకు (ACTOs) గెజిటెడ్ హోదాను కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 79 జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మొత్తం 537 మంది ఏసీటీవోలు గెజిటెడ్ అధికారులుగా గుర్తింపు పొందారు.
ఈ విషయాన్ని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్-గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దాదాపు పది సంవత్సరాలుగా సాగుతున్న ఈ డిమాండ్‌కు నేడు న్యాయం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ గెజిటెడ్ హోదా కోసం 2017 ఫిబ్రవరి 23న అప్పటి అధికారులకు ప్రతినిధులు సమర్పించినప్పటి నుంచి నిరంతర పోరాటం కొనసాగిందని ఆయన వివరించారు. రెండు పీఆర్‌సీలు, ఆర్థిక శాఖ, ఉన్నతాధికారుల స్థాయిలో అనేక చర్చలు జరగడంతో ఈ నిర్ణయం సాధ్యమైందని తెలిపారు.
ఈ ప్రక్రియలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కీలక పాత్ర పోషించారని తెలిపారు.
అలాగే వాణిజ్య పన్నుల మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం రఘునందన్ రావు జీవో జారీ చేయడంలో ముఖ్య పాత్ర వహించారని సంఘం అభినందనలు తెలిపింది.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో సంబరాలు చెలరేగాయి. ఉద్యోగులు టపాకాయలు కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జి. సుదర్శన్ గౌడ్, ఎం. విక్టర్ పాల్, జి. ప్రభాకర్, పి. ప్రవీణ్ కుమార్, మొహమ్మద్ అబ్దుల్ ముజీబ్, శ్రీనివాస్, శ్రీకాంత్, నరేందర్ రెడ్డి, మొహమ్మద్ సలావుద్దీన్, శ్రీమతి కృష్ణవేణి, వివి ఎన్ మూర్తి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
ఈ నిర్ణయం ద్వారా ఏసీటీవోల సేవలకు మరింత గౌరవం లభించడంతో పాటు, శాఖలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించడానికి మార్గం సుగమమవుతుందని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.









