
గంధంగూడ, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్): గంధంగూడ సర్వే నం. 86/2లో ప్రతిపాదిత మలిన జల శుద్ధి కేంద్రం (STP) నిర్మాణంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేకే నగర్ ఫేజ్–2, దత్తాత్రేయ కాలనీ, బృందావన్ కాలనీ, విఘ్నేశ్వర కాలనీల మధ్య ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

జనవాసాల మధ్య ఎస్‌టిపి ఏర్పాటు చేయడం వల్ల దుర్వాసన, దోమల పెరుగుదల, ఆరోగ్య సమస్యలు వంటి తీవ్రమైన ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్లాంట్ నుంచి వెలువడే రసాయనాలు, బ్యాక్టీరియా వల్ల పిల్లలు, వృద్ధులు ముఖ్యంగా శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.

మురుగునీటి శుద్ధి ప్రక్రియ కారణంగా దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశమున్నదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా, ప్లాంట్ నుంచి లీకేజీలు జరిగితే భూగర్భ జలాలు కలుషితం కావచ్చని కూడా వారు హెచ్చరిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఇలాంటి ప్లాంట్లను జనవాసాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా, మధ్యలో నిర్మాణం చేపట్టడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
జనవాసాల మధ్య STP ఏర్పాటు చేయకూడదని వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.