హైడ్రా మైనింగ్ కుంభకోణం: పొంగులేటి బర్తరఫ్ చేయాలి:శ్రవణ్ దాసోజు

హైదరాబాద్, మే 5: తెలంగాణలో హైడ్రా (HYDRAA) వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని ఆరోపిస్తూ వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూడు గంటల్లోనే తన ప్రకటనను మార్చడం వెనుక ఉన్న కారణాలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
అక్రమ మైనింగ్ జరుగుతున్నా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మరియు పోలీసులు స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. వందల కోట్ల విలువైన ప్రకృతి సంపద దోపిడీ జరుగుతున్నా అధికార యంత్రాంగం మౌనంగా ఉండటం వెనుక కుమ్మక్కు ఉందని ఆరోపించారు.
మానసా హిల్స్ మైనింగ్ అంశంపై ముందుగానే ఫిర్యాదులు వచ్చినప్పటికీ, హైడ్రా 60 రోజుల తర్వాత స్పందించడం ఆలస్యంగా జరిగిందని, ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి పొంగులేటి కలిసి అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపి, దోపిడీ ద్వారా సంపాదించిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.