
- కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి, భూ దందాల ఆరోపణలు
హైదరాబాద్, మే 23 (విశ్వం న్యూస్) : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ మాఫియాకు తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. “పొంగులేటి భవిష్యత్తు రాజకీయాల్లో కాదు.. చర్లపల్లి జైలులోనే ముగుస్తుంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పొంగులేటి తాజాగా రాజకీయ భవిష్యత్తులపై మాట్లాడడం హాస్యాస్పదమని, “రియల్ ఎస్టేట్ దందాలతో పాటు జ్యోతిష్యం కూడా నేర్చుకున్నావా?” అంటూ ఎద్దేవా చేశారు. “మా పొలిటికల్ ఫ్యూచర్ గురించి మాట్లాడే ముందు మీ అవినీతి లీలల గురించి ఆలోచించండి. మరో రెండేళ్లలో మీ అక్రమాలు బట్టబయలై జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే” అని హెచ్చరించారు.
మెట్రో ప్రాజెక్టులపై ప్రశ్నలు: హైదరాబాద్ మెట్రో నిర్మాణంపై కూడా దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. “పదేళ్లలో మెట్రో కట్టలేదని మాట్లాడే ముందు సిగ్గుండాలి. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి మెట్రో తీసుకొచ్చి రికార్డు సమయంలో ఫేజ్-1 పూర్తి చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వమే” అన్నారు. హైటెక్ సిటీ-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఫేజ్-2 ప్రణాళికలను రద్దు చేసింది రేవంత్ ప్రభుత్వమే కాదా అని ప్రశ్నించారు.
ఎల్&టీ వంటి ప్రతిష్టాత్మక సంస్థపై ఒత్తిడి తెచ్చి, బెదిరింపులకు పాల్పడి ప్రాజెక్టులను అతలాకుతలం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
‘ఫ్యూచర్ సిటీ కాదు.. ఫేక్ సిటీ’: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్న “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టుపై కూడా దాసోజు తీవ్ర విమర్శలు గుప్పించారు. “అది ఫ్యూచర్ సిటీ కాదు.. ఫేక్ సిటీ. ల్యాండ్ మాఫియాకు అడ్డాగా మారుతోంది” అన్నారు. పేదలు, రైతులు, గిరిజనుల భూములను బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే ప్రభుత్వ అసలు లక్ష్యమని ఆరోపించారు.
నాదర్గుల్, లగచర్ల ప్రాంతాల్లో రైతులను బెదిరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని, భూ కబ్జాల వెనుక భారీ ఇండస్ట్రియల్ మాఫియా ఉందని అన్నారు. “HILTP పాలసీల వెనుక ఉన్న భూ దందాలన్నింటినీ ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తాం” అని స్పష్టం చేశారు.
హరీష్, కేటీఆర్‌పై ప్రశంసలు: బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్‌లపై దాసోజు శ్రవణ్ ప్రశంసలు కురిపించారు. “తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి హరీష్ రావు, కేటీఆర్ రెండు కళ్ళు లాంటివారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధపడిన ఉద్యమ నాయకులు వారు” అన్నారు.
తెలంగాణ చరిత్రలో వారి పేర్లు సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయని, ప్రజల కోసం పోరాడిన నాయకులుగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి, పొంగులేటి పేర్లు మాత్రం రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ మాఫియాకు తాకట్టు పెట్టిన దోపిడీదారులుగా చరిత్రలో నిలుస్తాయని విమర్శించారు.
“ఎంత ఎంజాయ్ చేస్తారో చేసుకోండి.. ఎంత దోచుకుంటారో దోచుకోండి.. కానీ ప్రజల డబ్బులో ప్రతి పైసా కక్కించకుండా వదిలేది లేదు. మీ ఇద్దరి ఫ్యూచర్ జైల్లోనే ముగుస్తుంది” అంటూ దాసోజు శ్రవణ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.