“నీకు పెళ్లి చేయాల్సిన
చేతులతో తలకొరివి
పెడుతున్నా బిడ్డా..”

- అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవ్యకు కన్నీరుతో వీడ్కోలు
నల్లగొండ, మే 23 (విశ్వం న్యూస్) : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన యువతి గడుసు నవ్య (24) భౌతికకాయం ఆరు రోజుల అనంతరం శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కుమార్తె విగతజీవిగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.
గడుసు శ్రీనివాసరెడ్డి–శోభ దంపతుల పెద్ద కుమార్తె అయిన నవ్య, బీటెక్ పూర్తి చేసిన అనంతరం రెండున్నరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లింది. చికాగో రాష్ట్రంలోని రోజ్వెల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. ఈ నెల 16న రాత్రి కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి మరో వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
శుక్రవారం ఉదయం నవ్య మృతదేహం స్వగ్రామానికి చేరుకోగానే గ్రామమంతా విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కుమార్తెకు బొట్టు పెట్టిన తల్లి శోభ తీవ్ర భావోద్వేగానికి గురై సొమ్మసిల్లి పడిపోయింది. “నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని అనుకున్నా బిడ్డా.. కానీ నీకు తలకొరివి పెట్టే దుస్థితి వచ్చింది” అంటూ తండ్రి శ్రీనివాసరెడ్డి విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
మధ్యాహ్నం నవ్య అంత్యక్రియలు నిర్వహించగా, తండ్రే తలకొరివి పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతిమయాత్రలో గ్రామ సర్పంచ్ నేతగాని కృష్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఆలయ చైర్మన్ వరాల రమేష్, మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.