మాసబ్‌ట్యాంక్‌లో దారుణం (సీసీ ఫుటేజ్)

మాసబ్‌ట్యాంక్‌లో
దారుణం (సీసీ ఫుటేజ్)

  • ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ అనుమానాస్పద మృతి

హైదరాబాద్, మే 23 (విశ్వం న్యూస్): హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ పరిధిలో శనివారం ఉదయం సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన నగరవ్యాప్తంగా కలకలం రేపింది.

సమాచారం ప్రకారం.. ఖాజా మొయినుద్దీన్ శనివారం ఉదయం తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అనంతరం దుండగులు ఆయనపై దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మొయినుద్దీన్‌ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

సీసీ కెమెరాల్లో దుండగుల కదలికలు:ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వక్ఫ్ భూముల రక్షణ పోరాటం నేపథ్యంలోనా? : ఖాజా మొయినుద్దీన్ వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేస్తూ ప్రముఖంగా నిలిచారు. కబ్జాలకు గురవుతున్న వక్ఫ్ భూముల అంశంపై ఆయన పలు కేసుల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *