బీజేపీ-కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌పై అనుమానాలు

ద్వంద్వ వైఖరిపై స్పష్టత ఇవ్వాలి: దాసోజు శ్రవణ్

హైదరాబాద్, జూన్ 3, (విశ్వం న్యూస్) : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రదర్శిస్తున్న పరస్పర విరుద్ధ వైఖరి ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. ఒకవైపు హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని “ఛోటే భాయ్” అని సంబోధిస్తూ తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తుండగా, మరోవైపు బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.

బీజేపీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంలా ఉపయోగించుకుంటోందని, సీఎం రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న సమయంలో, అదే పార్టీ అత్యున్నత నాయకత్వం ఆయనతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను ప్రజలకు వివరించాలని దాసోజు డిమాండ్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే, బయటకు ప్రతిపక్ష రాజకీయాలు చేస్తూ తెరవెనుక మాత్రం కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న నాయకుడినే రేపు తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? లేక ఆ ఆరోపణలను నిజంగా నమ్ముతున్నారా? అనే అంశంపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని కోరారు.

రేవంత్ రెడ్డి బీజేపీ దృష్టిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రా? లేక బీజేపీలో చేరాలని బహిరంగంగా ఆహ్వానిస్తున్న రాజకీయ మిత్రుడా? అనే ప్రశ్నకు దేశ ప్రజలు, తెలంగాణ సమాజం సమాధానం కోరుతోందని డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *