
హైదరాబాద్, జూలై 11 (విశ్వం న్యూస్) : భద్రాద్రి శ్రీరాముడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఖమ్మం జిల్లా రైతు ఆశీర్వాద సభను సీఎం రాజకీయ విమర్శల వేదికగా మార్చారని, ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు చేశారని ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.
రాజ్యాంగంపై ప్రశ్నలు : 2028లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు 2029కు వాయిదా పడతాయని సీఎం చేసిన వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానిదేనని, సీఎం వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థలను ప్రశ్నించేలా ఉన్నాయని అన్నారు. డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ వైఖరికి విరుద్ధంగా సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాముడిపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : భద్రాచలం, శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను సీఎం వెంటనే వెనక్కి తీసుకుని భక్తులకు క్షమాపణ చెప్పాలని దాసోజు డిమాండ్ చేశారు. యుగాలు మారినా శ్రీరాముని ఆరాధన కొనసాగుతూనే ఉంటుందని, రాజకీయాల కోసం దేవుడి ఉనికిని ప్రశ్నించడం సరికాదన్నారు.
మేడిగడ్డపై ప్రభుత్వ వైఖరిపై విమర్శలు : మేడిగడ్డ బ్యారేజ్, గోదావరి వరదలపై సీఎం చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని దాసోజు శ్రవణ్ అన్నారు. గతంలో భారీ వరదలను భద్రాచలం, మేడిగడ్డ తట్టుకున్నాయని, ప్రస్తుతం తక్కువ ప్రవాహానికే భద్రాచలం కొట్టుకుపోతుందని చెప్పడం సాంకేతిక అవగాహన లేమికి నిదర్శనమని పేర్కొన్నారు. రిటైర్డ్ ఇంజినీర్లు సూచించిన అంశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం : కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా తెలంగాణ రైతులకు అవసరమైన నీటిని వినియోగించకుండా వదిలేస్తున్నారని దాసోజు ఆరోపించారు. తెలంగాణ సాగునీటి ప్రయోజనాల కంటే ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చివరకు ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన తీర్పు ఇస్తారని ఆయన పేర్కొన్నారు.