వియత్నాంలో భారత పర్యాటకుల స్పీడ్‌బోట్ బోల్తా 15 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

వియత్నాంలో భారత పర్యాటకుల స్పీడ్‌బోట్ బోల్తా 15 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్/వియత్నాం, జూలై 11: వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్‌బోట్ బోల్తా పడిన ఘటనలో 15 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, 32 మంది పర్యాటకులు, కొందరు సిబ్బందితో ప్రయాణిస్తున్న ఏజీ-26751 రిజిస్ట్రేషన్ నంబర్ గల స్పీడ్‌బోట్ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద స్థలం నుంచి 23 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సాంకేతిక లోపంతో ప్రమాదం : ‘మిన్ హుయ్ ఫూ క్వాక్ ట్రేడింగ్ అండ్ టూరిజం కంపెనీ లిమిటెడ్’కు చెందిన ఈ స్పీడ్‌బోట్ హోన్ మే రుట్ న్గోయ్ నుంచి సుమారు 400 మీటర్లు ప్రయాణించిన తర్వాత అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది సముద్రంలో పడిపోయారు.

ముమ్మర సహాయక చర్యలు : ప్రమాదం జరిగిన వెంటనే సరిహద్దు రక్షణ దళం రెండు బోట్లు, 35 మంది జవాన్లతో సహాయక చర్యలు చేపట్టింది. నేవీ, కోస్ట్‌గార్డ్‌తో పాటు ఇతర విభాగాలు కలిసి బాధితులను రక్షించే కార్యక్రమం నిర్వహించాయి. జెట్ స్కీలు, లైఫ్‌జాకెట్ల సహాయంతో పలువురిని సురక్షితంగా ఒడ్డుకు తరలించారు.

సీఎం రేవంత్ దిగ్భ్రాంతి : ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ, వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. తెలుగువారు ఉన్నారనే ప్రాథమిక సమాచారం నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించి, గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు.

హెల్ప్‌లైన్ నంబర్లు : బాధిత కుటుంబాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. అవసరమైన సమాచారం కోసం 9885371189, 7997959754, 9989654807, 7997959779 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *