తెలంగాణ ఉద్యమకారుల కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి -ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమకారుల సమావేశం గురువారం హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక దీపం కేంద్రంలో కే. కేశవరావు, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సమస్యలు, డిమాండ్లకు సంబంధించిన నివేదికను కమిటీ సభ్యులకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రతి నెల రూ.25 వేల పెన్షన్ అందించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యమకారులకు ఉచిత వైద్యం కల్పించాలని, ఇంటి నిర్మాణం కోసం 250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారుల పిల్లలకు ఉచిత విద్య, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక గౌరవం, ఆర్టీసీ బస్సుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులను తక్షణమే నియమించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల కమిటీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మహమ్మద్ హబీబ్, మిర్జా ఇమ్రాన్ బేగ్, ఏ. సురేష్ తదితరులు పాల్గొన్నారు.