ఖైరతాబాద్‌లో 44 అనుమానాస్పద ఓట్లు.. దాసోజు శ్రవణ్ ఫైర్!

ఖైరతాబాద్‌లో 44 అనుమానాస్పద ఓట్లు.. దాసోజు శ్రవణ్ ఫైర్!

ఖైరతాబాద్‌లో 44 అనుమానాస్పద ఓట్లు.. దాసోజు శ్రవణ్ ఫైర్!

  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికల సంఘం
    ఖైరతాబాద్‌లో ఒకే వాణిజ్య కార్యాలయ చిరునామాపై 44 ఓట్లు.. ఈఆర్‌వో, బీఎల్‌వోలపై చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్

విశ్వo న్యూస్‌, హైదరాబాద్‌, ఆగస్టు 19: తెలంగాణలో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రక్రియ నకిలీ ఓట్ల నమోదుకు మార్గంగా మారిందని విమర్శించారు.

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (AC-60), పోలింగ్ బూత్ నంబర్ 237 పరిధిలోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఒక ప్రైవేట్ వాణిజ్య కార్యాలయ చిరునామాపై ఏకంగా 44 ఓట్లు నమోదయ్యాయని ఆయన తెలిపారు. డోర్ నంబర్ 8-2-684/250లో కాల్ సెంటర్, ఇతర ప్రైవేట్ కార్యాలయాలు నిర్వహిస్తున్నప్పటికీ, అక్కడ పెద్ద సంఖ్యలో ఓటర్లు నమోదయ్యారని పేర్కొన్నారు.

SIRకు ముందు అదే చిరునామాపై 19 అనుమానాస్పద ఓట్లు ఉన్నట్లు బీఆర్‌ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లు గుర్తించారని, వాటిని పరిశీలించి తొలగించాలని సంబంధిత ERO, BLOలకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు శ్రవణ్ తెలిపారు. అయితే పాత ఓట్లను తొలగించకపోగా, కొత్త జాబితాలో అదే చిరునామాపై 44 ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు.

క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన అధికారులు నిబంధనలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అక్రమాలను ప్రశ్నించిన బీఆర్‌ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లపై తప్పుడు పోలీసు కేసులు నమోదు చేసి వారిని భయపెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.

“ఒక చిన్న ప్రైవేట్ కాల్ సెంటర్ కార్యాలయంలో 44 మంది ఓటర్లు ఎలా నివసిస్తారు? ఇది సాధారణ సాంకేతిక తప్పిదం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే వ్యవస్థాగత మోసం” అని దాసోజు శ్రవణ్ అన్నారు.

సంబంధిత ERO, BLOలపై తక్షణమే విచారణ జరిపి క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య భవనాలు, ఒకే చిరునామాపై అధిక సంఖ్యలో నమోదైన ఓట్లపై సమగ్ర ఫీల్డ్ వెరిఫికేషన్, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. అక్రమాలను ప్రశ్నించిన బీఆర్‌ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజలు, పౌర సమాజం, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ ప్రాంతాల్లోని ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద నమోదులను వెలుగులోకి తీసుకురావాలని దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *