రేవంత్‌ రెడ్డి.. తెలంగాణలో అత్యంత బలహీన సీఎంగా మారుతున్నారా?

రేవంత్‌ రెడ్డి.. తెలంగాణలో అత్యంత బలహీన సీఎంగా మారుతున్నారా?

విశ్వo న్యూస్‌, హైదరాబాద్‌, ఆగస్టు 20: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రస్తుతం అనూహ్యమైన రాజకీయ పరిస్థితి ఎదురవుతోంది. సాధారణంగా అధికార పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం. కానీ ఇప్పుడు సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్‌ నేతలే ముఖ్యమంత్రిని, ప్రభుత్వ పనితీరును బహిరంగంగా ప్రశ్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తానే తుది నిర్ణయాధికారిననే భావనను రేవంత్‌ రెడ్డి తరచూ వ్యక్తం చేస్తుంటారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల నుంచి వరుసగా అసంతృప్తి వ్యక్తమవుతుండటం ఆయన నాయకత్వానికి ఇమేజ్‌ సమస్యగా మారుతోంది.

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తాము ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోతున్నామని నేతలు దానం నాగేందర్‌, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రభుత్వంలో కొందరు భారీగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.

రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హెచ్చరించినట్లు సమాచారం. అయితే అందుకు రాజగోపాల్‌ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ.. ఆ పాఠాలు రేవంత్‌ రెడ్డికి చెప్పాలని అన్నట్లు తెలుస్తోంది. మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి కూడా రాజగోపాల్‌ రెడ్డి చేసిన విమర్శల్లో తప్పేమీ లేదంటూ ఆయనకు మద్దతు పలికినట్లు సమాచారం.

సీనియర్‌ నేత చిన్నారెడ్డి సైతం రేవంత్‌ ఇదే విధానాన్ని కొనసాగిస్తే తాను కూడా జీవన్‌ రెడ్డి మాదిరిగా తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పరకాల టికెట్‌ వ్యవహారంపై అసంతృప్తితో ఉన్న కొండా సుష్మిత.. అధికారంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తుండటమే అసలు సమస్య

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనను బహిరంగంగా ప్రశ్నించేందుకు వెనుకాడటం లేదు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌ నాయకత్వంపై కొత్త చర్చ మొదలైంది. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ముఖ్యమంత్రులతో పోలిస్తే రేవంత్‌ రాజకీయంగా బలహీనంగా కనిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది కేవలం విమర్శల సమస్య మాత్రమే కాదు. పార్టీ అంతర్గతంగా పదేపదే బహిరంగ విమర్శలు, అసంతృప్తులు వ్యక్తమవుతున్నప్పటికీ వాటిని సమర్థంగా నియంత్రించలేకపోవడం నాయకత్వానికి సవాలుగా మారుతోంది.

ఇదే పరిస్థితి కొనసాగితే రేవంత్‌ రెడ్డికి ప్రధాన రాజకీయ సవాలు బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి కాకుండా.. తన పక్కనే ఉన్న కాంగ్రెస్‌ నేతల నుంచే ఎదురయ్యే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *