వీడిన మిస్టరీ: టెన్త్ క్లాస్ విద్యార్థులే హంతకులు!
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ: టెన్త్ క్లాస్ విద్యార్థులే హంతకులు!

నల్గొండ: కొండమల్లేపల్లి పట్టణంలోని జేబీ కాలనీలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి (45) దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ ఘోరానికి ఒడిగట్టింది సదరు స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులేనని విచారణలో తేలింది.
పోలీసుల కథనం ప్రకారం.. తమ జల్సాల కోసమే విద్యార్థులు ఈ దారుణానికి ప్రణాళిక వేశారు. ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమనించిన ముగ్గురు విద్యార్థులు, ఆమె వద్ద ఉన్న డబ్బును అపహరించేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి చొరబడి ఆమెపై సుమారు 27 సార్లు కత్తులతో పొడిచి అత్యంత క్రూరంగా హతమార్చారు.
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుల అరెస్టును జిల్లా ఎస్పీ అధికారికంగా ప్రకటించనున్నారు. మైనర్ విద్యార్థులే గంజాయి మత్తులో, జల్సాల కోసం ఈ స్థాయి దారుణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.