మంత్రి కొండా సురేఖపై అధిష్ఠానం కీలక నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 3: హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. సురేఖను గురువారం సాయంత్రంలోగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. నిర్ణీత గడువులోగా ఆమె రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కుమార్తె వ్యాఖ్యలతో వివాదం: మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
అధిష్ఠానానికి నివేదిక : ఈ వ్యవహారాన్ని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సీరియస్‌గా తీసుకుంది. సురేఖ నుంచి వివరణ కోరగా.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. అనంతరం క్రమశిక్షణా కమిటీ విచారణ జరిపి నివేదికను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపింది.
రాజీనామాపై ఉత్కంఠ : రిపోర్టు అందిన వెంటనే నిర్ణయం తీసుకోకుండా.. సురేఖ వివరణ, ఈ వ్యవహారం పార్టీపై చూపే ప్రభావం, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు తదితర అంశాలను అధిష్ఠానం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి వ్యవహారానికి కూడా ముగింపు పలకాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ స్వయంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. తనను పదవి నుంచి తప్పించాలనుకుంటే అధిష్ఠానమే బర్తరఫ్ చేయాలనే ధోరణిని ఆమె వ్యక్తం చేసినట్లు గురువారం ఉదయం వెలువడిన నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో సురేఖ తదుపరి అడుగు ఏమిటన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.