కరువుపై కేంద్రం, రాష్ట్రం నిర్లక్ష్యం: దాసోజు శ్రవణ్

కరువుపై కేంద్రం, రాష్ట్రం నిర్లక్ష్యం: దాసోజు శ్రవణ్

కరువుపై కేంద్రం, రాష్ట్రం నిర్లక్ష్యం: దాసోజు శ్రవణ్

  • ఢిల్లీ పర్యటనల్లో రాజకీయాలే తప్ప.. తెలంగాణ కరువుపై స్పందనేది? – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రశ్న
  • విశ్వం న్యూస్, హైదరాబాద్, 4 నవంబర్ 2026:తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు తిరిగి బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని సమర్థంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కన్నెపల్లి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించి నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ కరువు, సాగునీరు, తాగునీటి సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. కరువు సహాయం కింద రాష్ట్ర అసెంబ్లీ కోరిన రూ.20 వేల కోట్ల నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ‘ఆర్ఆర్ టాక్స్’ వసూళ్లు జరుగుతున్నాయంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణల్లో నిజం ఉంటే సీబీఐ, ఈడీతో విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే విచారణ జరిపించాలని, లేదంటే ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు.

మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై నిరసనలు, పబ్లిక్ హియరింగ్‌లకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఒక రకంగా, బీఆర్ఎస్ నాయకులకు మరో రకంగా అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్నది ‘అనుముల రాజ్యాంగమా? అంబేద్కర్ రాజ్యాంగమా?’ అని డీజీపీ ఆనంద్‌ను నిలదీశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19 ప్రకారం అందరికీ సమాన హక్కులు కల్పించాలని కోరారు.

కేంద్రం వెంటనే రూ.20 వేల కోట్ల కరువు సహాయం విడుదల చేయాలని, కన్నెపల్లి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించాలని, గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకులపై ముందస్తు అరెస్టులు నిలిపివేసి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడాలని కోరారు.

ఎన్ని అరెస్టులు చేసినా తెలంగాణ రైతులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్వాయి స్రవంతి రెడ్డి, తొట్ల స్వామి యాదవ్, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *