బీసీ ఆత్మగౌరవ భవనాలపై ప్రభుత్వ పెత్తనం : దాసోజు శ్రవణ్

బీసీ ఆత్మగౌరవ భవనాలపై ప్రభుత్వ పెత్తనం : దాసోజు శ్రవణ్

బీసీ ఆత్మగౌరవ భవనాలపై ప్రభుత్వ పెత్తనం వద్దు

  • జీఓ 14ను తక్షణమే రద్దు చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు డా. దాసోజు శ్రవణ్ వినతి

విశ్వం న్యూస్, హైదరాబాద్, 4 నవంబర్ 2026 : బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.14ను తక్షణమే రద్దు చేయాలని డా. దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. భవనాల నిర్వహణ బాధ్యతలను ఆయా బీసీ కుల సమాజాల రిజిస్టర్డ్ ట్రస్టులకే అప్పగించాలని కోరారు.

బీసీ ఆత్మగౌరవ భవనాలు కేవలం నిర్మాణాలు కావని, శతాబ్దాలుగా అణచివేతకు గురైన వృత్తి కులాల ఆత్మగౌరవానికి, స్వయంపాలనకు ప్రతీకలని శ్రవణ్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 41 బీసీ, ఇతర కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 87 ఎకరాల 30 గుంటల భూమిని కేటాయించడంతో పాటు నిర్మాణాల కోసం రూ.95.25 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు.

2021లో అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన 41 కులాల సంఘాలతో సమావేశాలు నిర్వహించి, ఉమ్మడి ట్రస్టుల ద్వారా భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించే విధానాన్ని రూపొందించారని తెలిపారు. 15 కులాల ఉమ్మడి సంఘాల్లో తొమ్మిది సంఘాలు సొంతంగా నిర్మాణాలు చేపట్టేందుకు, ఆరు సంఘాలు ప్రభుత్వ నిర్మాణాన్ని ఎంచుకునేందుకు అవకాశం కల్పించారని వివరించారు. ముదిరాజ్ సమాజానికి కోకాపేటలో ఐదు ఎకరాల భూమితో పాటు రూ.5 కోట్లు కేటాయించి, నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ముదిరాజ్ డెవలప్‌మెంట్ ట్రస్టుకు అప్పగించిన విషయాన్ని ప్రస్తావించారు.

అయితే ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన జీఓ 14 ద్వారా బీసీ కుల సంఘాల స్వయంపాలన హక్కులను దెబ్బతీస్తోందని విమర్శించారు. నిర్వహణ కమిటీల్లో అధికారులకు ప్రాధాన్యత ఇవ్వడం, కమిటీల నియామక అధికారాన్ని ప్రభుత్వ పరిధిలో ఉంచడం, కుల సంఘాలకు పరిమిత పాత్ర కల్పించడం సరికాదన్నారు. సొంత నిధులతో నిర్మించుకున్న భవనాలకు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు వర్తింపజేయడం, ప్రతి నెలా ఫొటోలతో నివేదికలు కోరడం అనవసరమైన జోక్యమని పేర్కొన్నారు.

భవనాల్లో రాజకీయ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై ఆంక్షలు విధించడం, కమిటీలను నోటీసులు ఇవ్వకుండానే రద్దు చేసే అధికారం కల్పించడం, కుల సంప్రదాయాలు, మహనీయుల జయంతి కార్యక్రమాల నిర్వహణపై పరిమితులు విధించడం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఈ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 25, 29(1), 300ఎలకు విరుద్ధంగా ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా శ్రవణ్ ప్రస్తావించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఏటా రూ.20 వేల కోట్ల నిధులు, ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాల నిర్మాణం వంటి హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కొత్త భవనాలు నిర్మించకపోగా, ఇప్పటికే ఉన్న ఆత్మగౌరవ భవనాల నిర్వహణ అధికారాలను కూడా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం అన్యాయమన్నారు.

ప్రభుత్వానికి నాలుగు ప్రధాన డిమాండ్లు

జీఓ ఎంఎస్ నెం.14ను తక్షణమే పూర్తిగా రద్దు చేయాలి.

గతంలో అమలులో ఉన్న విధానాన్ని పునరుద్ధరించి, నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఆయా కులాల రిజిస్టర్డ్ ట్రస్టులకు అప్పగించాలి.

కొత్త మార్గదర్శకాలు రూపొందించే ముందు అన్ని బీసీ కుల సంఘాలు, బీసీ కమిషన్, అన్ని పార్టీల బీసీ ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరపాలి.

మంజూరైన రూ.95.25 కోట్లలో ఇప్పటివరకు విడుదల చేసిన నిధుల వివరాలు, 41 భవనాల ప్రస్తుత స్థితిని బహిర్గతం చేసి, పెండింగ్ నిర్మాణాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి.

బీసీలు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే వర్గాలు కాదని, రాష్ట్ర సంపదను సృష్టించే శ్రమజీవులని శ్రవణ్ పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవం, స్వయంపాలనను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తమ విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోకపోతే శాసనసభ, శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని, అవసరమైతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *