35 శాతం మంది ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 నియామకాలపై విచారణకు శ్రవణ్ దాసోజు డిమాండ్

35 శాతం మంది ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 నియామకాలపై విచారణకు శ్రవణ్ దాసోజు డిమాండ్

35 శాతం మంది ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 నియామకాలపై విచారణకు శ్రవణ్ దాసోజు డిమాండ్

విశ్వం న్యూస్, హైదరాబాద్‌, 10 నవంబర్ 2026 : తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై మరోసారి వివాదం మొదలైంది. గ్రూప్-1 పరీక్షల ద్వారా ఎంపికైన 112 మంది ట్రైనీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)ల్లో 40 మందికి పైగా పోలీస్ అకాడమీ పరీక్షల్లో ఫెయిల్ కావడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 35 శాతం మంది ఉత్తీర్ణత సాధించకపోవడం ఎంపిక, మూల్యాంకన ప్రక్రియలోని లోపాలను బయటపెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు తుంగ బాలు, సతీష్ ఉపేంద్ర, కొడంగల్ రవికుమార్ తదితరులతో కలిసి డా. శ్రవణ్ దాసోజు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 112 మంది ట్రైనీ డీఎస్పీలు 10 నెలల పాటు 10 సబ్జెక్టుల్లో మొత్తం 1,600 మార్కులకు కఠిన శిక్షణ పొందారని తెలిపారు. అయినప్పటికీ 40 మందికి పైగా కనీసం 50 శాతం ఉత్తీర్ణత మార్కులు సాధించలేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అత్యున్నత ర్యాంకులు సాధించి ఉద్యోగాలకు ఎంపికైన అధికారులు ప్రాథమిక పరీక్షల్లోనే ఫెయిల్ కావడం సాధారణ విషయం కాదని, ఇది మొత్తం ఎంపిక, మూల్యాంకన వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు.

ఈ వైఫల్యానికి అకాడమీలో బోధనా లోపాలు, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభను సరిగ్గా అంచనా వేయకపోవడం లేదా ఎంపిక ప్రక్రియలో మార్కులు, ర్యాంకుల కేటాయింపులో అవకతవకలు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కేవలం పోలీస్ అకాడమీ వైఫల్యంగా చూపించి టీజీపీఎస్సీ బాధ్యత నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేశారు.

గతంలో హైకోర్టు గ్రూప్-1 మూల్యాంకన ప్రక్రియలో విధానపరమైన లోపాలు, ప్రైవేట్ కోచింగ్ ట్యూటర్లతో మూల్యాంకనం, మోడరేషన్ లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించిందని గుర్తుచేశారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అకాడమీ ఫలితాలను కూడా వాటితో పోల్చి పరిశీలించాలని కోరారు. ఫెయిల్ అయిన అభ్యర్థుల జవాబు పత్రాలను ఎవరు మూల్యాంకనం చేశారు? రెండో, మూడో మూల్యాంకనాల్లో మార్కులు భారీగా పెరిగాయా? కొన్ని పరీక్షా కేంద్రాల నుంచే అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావడానికి కారణాలేమిటి? అనే అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

టీజీపీఎస్సీకి సమర్పించిన వినతిపత్రంలో ఆరు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి, ఫోరెన్సిక్ స్టాటిస్టిషియన్‌తో స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేసి 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. ట్రైనీ డీఎస్పీల సబ్జెక్టులవారీ మార్కులు, రీ-ఎగ్జామ్ ఫలితాలు, గత బ్యాచ్‌ల ఉత్తీర్ణత వివరాలను భద్రపరచాలని సూచించారు. అకాడమీ మార్కులను మెయిన్స్ మార్కులు, పరీక్షా కేంద్రాలు, మూల్యాంకన వివరాలతో పోల్చి ఆడిట్ నిర్వహించాలని పేర్కొన్నారు.

అలాగే కేవలం డీఎస్పీలకే పరిమితం కాకుండా మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల ఎంపిక, శిక్షణ ఫలితాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జవాబు పత్రాలు, బార్‌కోడ్ మ్యాపింగ్ వివరాలు, మూల్యాంకన లాగ్స్, బయోమెట్రిక్ డేటా, సీసీటీవీ ఫుటేజ్‌లను భద్రపరచాలని కోరారు. విచారణ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు.

టీజీపీఎస్సీపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడమే తన బాధ్యతని గతంలో ప్రకటించిన చైర్మన్ బుర్రా వెంకటేశం ఇప్పుడు ఈ అంశంపై సమగ్ర విచారణకు చర్యలు తీసుకోవాలని డా. శ్రవణ్ దాసోజు కోరారు. ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా స్పష్టమైన సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *