చరిత్రలో నిలిచిపోయే గొప్ప నేత కేసిఆర్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
భారతావని విముక్తి కోసం పోరాడిన నిఖార్సైన యోధుడు ఛత్రపతి శివాజీ
ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఆయన ఆశయ స్పూర్తిని సీఎం కేసిఆర్ కొనసాగిస్తున్నారు
శుక్రవారం నాడు బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి
నిజామాబాద్, పిబ్రవరి 24 (విశ్వం న్యూస్) : శుక్రవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ముప్కాల్ మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతావని విముక్తి కోసం పోరాడిన నిఖార్సైన యోధుడు ఛత్రపతి శివాజీ అని పడగల్ లో ఆయన విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు. అఖండ భారతమే ధ్యేయంగా 10 మంది సైనికులతో బయలుదేరిన ఛత్రపతి శివాజీ చరిత్ర పుటల్లో నిలిచిపోయారని కొనియాడారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఆయన ఆశయ స్పూర్తిని సీఎం కేసిఆర్ కొనసాగిస్తున్నారని అన్నారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో ఒక్కడే ప్రాణాలకు తెగించి బయలుదేరి తెలంగాణ రాష్ట్రం సాధించిన దార్శనిక నాయకుడు కేసిఆర్ అని తెలిపారు. తెచ్చుకున్న తెలంగాణలో నేడు పుష్కలంగా సాగు నీరు, కరెంట్, పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. మార్పుపై ప్రతి ఒక్కరూ గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలని కోరారు. ఎవరు ఏమన్నా చరిత్రలో నిలిచిపోయే గొప్ప నేత కేసిఆర్ అని మంత్రి స్పష్టం చేశారు.