డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్

డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్

హైదరాబాద్, డిసెంబర్ 31, (విశ్వం న్యూస్) : రాష్ట్ర కొత్త ఇం చార్జ్ డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు చేపట్టారు. మహేందర్ రెడ్డి నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్ కు అభినందనలు తెలిపారు. డీజీపీగా మహేందర్‌రెడ్డి పదవీ కాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలోఅంజనీకుమార్ ను ఇంఛార్జ్ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
1990 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్.. అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వరంగల్‌ జిల్లా జనగామ ఏఎస్పీగా తొలి పోస్టింగ్‌ పొందారు. ఆ తరువాత మహబూబ్‌నగర్‌, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. 1998లో ఐక్య రాజ్య సమితి శాంతిపరిరక్షక దళానికి ఎంపికై బోస్నియా-హెర్జిగోవినాలో సంవత్సరంపాటు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన రెండుసార్లు ఐక్యరాజ్యసమితి శాంతి పతకాన్ని అందుకున్నారు. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా, గ్రేహౌండ్స్‌ చీఫ్‌గా, నిజామాబాద్‌ రేంజ్‌ల డీఐజీగా, వరంగల్ ఐజీగా, హైదరాబాద్‌ ఏసీపీగా, సీపీగా, ఏసీబీ డీజీగా వివిధ హోదాల్లో అంజనీకుమార్ పని చేశారు.

రాష్ట్ర డిజిపిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని శనివారం ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు డిజిపి గా అవకాశం కల్పించినందుకు సిఎం కెసిఆర్ కు ఆయన కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ కు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *