Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహనుమకొండహైదరాబాద్

ఆటోను ఢీకొన్న కారు… ముగ్గురు మృతి

  • మానుకోట జిల్లాలో ఘోర ప్రమాదం..

తొర్రూర్, జూలై 5 (విశ్వం న్యూస్) : శుక్రవారం రాత్రి 8 గంటలు దాటిన తరువాత మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి ఆరుగురు ప్రయాణికులతో ఓ ఆటో మరిపెడకు వెళ్తోంది. ఈ క్రమంలో ఆటో దంతాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోకి చేరుకోగా, మరిపెడ వైపు నుంచి ఓ కారు వేగంగా దంతాలపల్లికి వస్తోంది. అతివేగంగా వచ్చిన కారు దంతాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆటోను ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయి రెండు భాగాలుగా విరిగిపోయింది. దీంతో తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బంధు మల్లేష్(35), దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన పగిండ్ల కొమురయ్య(38), వాల్య తండాకు చెందిన భూక్య నరేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలోనే ఉన్న కొమురయ్య భార్య మంజుల, కూతురు అంజలి, మహబూబాబాద్ మండలం ఆమనగల్ గ్రామానికి చెందిన అక్షయకు తీవ్ర గాయాలయ్యాయి.

మృతదేహాలు నడిరోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఇదిలాఉంటే ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉండగా, అక్కడి పరిస్థితి చూసి అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ముగ్గురి పరిస్థితి సీరియస్
ఘటన స్థలంలో పడి ఉన్న మృతదేహాలను పోలీసులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీకి పంపించారు. దీంతో బాధిత కుటంబ సభ్యులు మార్చురీకి చేరుకుని బోరున విలపించారు. కాగా తీవ్ర గాయాలపాలైన మంజుల, అంజలి, అక్షయను స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడం, రక్త స్రావం కూడా ఎక్కువగానే జరగడంతో ఎంజీఎం క్యాజువాలిటీలో అడ్మిట్ చేసి, చికిత్స అందిస్తున్నారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగానే ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *