హైదరాబాద్, డిసెంబర్ 10 (విశ్వం న్యూస్) : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో క్యాబినెట్లో చోటు దక్కనుంది. ఏపీలో 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన నుంచి క్యాబినెట్లో పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ కొనసాగుతున్నారు.
కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దాంతో భర్తీ కావాల్సి ఆ స్థానంలో నాగబాబుకు అవకాశం కల్పించనున్నారు. త్వరలో నాగబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక రకంగా చూస్తే మెగా కుటుంబం నుంచి అటు అన్నయ్య చిరంజీవి.. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే అప్పటి మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇపుడు అదే ఇంటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు త్వరలో ఆంధ్ర ప్రదేశ్ చంద్రబాబు మంత్రి వర్గంలో క్యాబినేట్ మంత్రి కాబోతున్నారు.
మరోవైపు ఏపీ నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. బీద మస్తానరావు, సానా సతీష్ పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ ప్రకటించింది.