అనుమతి లేకుండా ఇసుక మొరం మట్టి తరలిస్తే చర్యలు తప్పవు
వరంగల్ బ్యూరో, మార్చి 6 (విశ్వం న్యూస్) : రెవెన్యూ శాఖ అనుమతి లేకుండా ఇసుక మొరం మైన్స్ వంటివి తరలిస్తే చర్యలు తప్పవని తహసిల్దార్ అల్లం రాజకుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడారు. గత కొద్ది రోజులుగా కొంతమంది జేసీబి ల సహాయంతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక, మోరం తరలిస్తుండడం వ్యాపార లావాదేవీలు నిర్వహించడం తమ దృష్టికి రావడం జరిగిందని అన్నారు. వెంటనే సిబ్బందితో అలర్ట్ చేసి వాటిని నివారించడం జరిగిందని తెలిపారు. ఇకనైనా రెవెన్యూ అనుమతులు లేకుండా ఎలాంటి మొరము ఇసుక మట్టిని తరలించరాదని అన్నారు. ఒక రైతు తన సొంత రెవెన్యూ పట్టా ఉన్న భూమిలోని ఇసుక కానీ మొరం కానీ మట్టి కానీ తరలించాలంటే తప్పనిసరిగా ముందుగా రెవెన్యూ అనుమతులు పొందాలని అన్నారు. అనుమతి పొందిన తర్వాత తరలించే మొరం కానీ ఇసుక కానీ మట్టి కానీ తన సొంత పనులకు మాత్రమే వినియోగించుకోవాలని వ్యాపారానికి వినియోగించుకోకూడదని వ్యాపారంగా పాల్పడ్డట్టు తెలిస్తే అతని అనుమతి పత్రాన్ని రద్దు చేయడంతో పాటు చట్టరీత్యా చర్యలు చేపడతామని అన్నారు. వ్యాపారపరంగా మట్టి మొరం ఇసుక తరలించిన వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఫైన్ విధించడం జరుగుతుందని అన్నారు. ఈ విషయముపై బుధవారం వాహన యజమానులు సంబంధిత రైతులతో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజేందర్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.