ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వాకం

  • నిజామాబాద్: స్ట్రెచర్ లేక రోగి కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు

నిజామాబాద్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడింది. ఆస్పత్రిలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని బంధువులు కాళ్లు పట్టుకుని నేలపై లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత నెల 31న సాయంత్రం ఓ రోగిని అతని బంధువులు అస్పత్రికి తీసుకొచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. అయితే ఓపీ మధ్యాహ్నం వరకు మాత్రమే ఉండటంతో రాత్రంతా అక్కడే ఉండిపోయారు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తరువాత.. బంధువులు ఓపీ రిజిస్టర్ చేయించారు. దీంతో రెండో అంతస్తులోని డాక్టర్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. అయితే ఆ వ్యక్తిని లిఫ్ట్ వరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ అవసరం పడింది. కానీ స్ట్రెచర్ అందుబాటులో లేకపోవటంతో బంధువులు అతని కాళ్లు పట్టుకుని నేలపైనే లాక్కెళ్లారు. రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నా అక్కడి వైద్య సిబ్బంది పట్టించుకోలేదు.

అయితే రోగిని రెండో అంతస్తుకు తీసుకెళ్లాక అక్కడ ఉన్న స్ట్రెచర్, వీల్‌చైర్ కనిపించలేదు. దీంతో మళ్లీ కాళ్లు పట్టుకుని నేలపైనే డాక్టర్ రూమ్ దగ్గరకు లాక్కెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది నిమ్మకునీరెత్తనట్లు ఉన్నారని, ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తోన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *