కేసీఆర్‌పై రాజకీయ కక్షకు నిరసనగా ఆసిఫాబాద్‌లో నల్లజెండాల ర్యాలీ

కేసీఆర్‌పై రాజకీయ కక్షకు
నిరసనగా ఆసిఫాబాద్‌లో
నల్లజెండాల ర్యాలీ

  • ఆసిఫాబాద్ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 1, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ ఉద్యమ రాతసారథి, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారిని మానసికంగా వేధించాలనే దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు కలిసి అక్రమ కేసులు బనాయించి తప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆసిఫాబాద్ పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది.

స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి కోవా లక్ష్మి గారి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నల్లజెండాల ర్యాలీ పట్టణ వీధుల్లో ఉద్ధృతంగా కొనసాగింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ నిరసనకారులు నినాదాలతో పట్టణాన్ని దద్దరిల్లించారు.

ఈ నిరసనలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, “కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయనపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలన్న ప్రయత్నాలు ప్రజలు సహించరు. ఇది రాజకీయ ప్రతీకారానికి పరాకాష్ట” అని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న రాక్షస చర్యలను ముక్తకంఠంతో ఖండించారు. వినాశకాలే విపరీత బుద్ధితో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి నశించాలంటూ గట్టిగా నినాదాలు చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు, కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు కొనసాగుతాయని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *