గ్రేవ్‌యార్డు మానవ హక్కు
రాజకీయంగా చూడకండి:
ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విశ్వం న్యూస్): బోరబండ ప్రాంతంలోని ముస్లిం సమాజానికి గ్రేవ్‌యార్డు లేకపోవడం బాధాకరమని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ, యూసఫ్‌గూడ ప్రాంత ప్రజలు మృతదేహాలను దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోందని తెలిపారు. ఈ రోజు ముస్లిం మత పెద్దలతో కలిసి హైదరాబాద్ అదనపు కలెక్టర్‌ను కలసిన ఆయన, 2 ఎకరాలు 16 గుంటల ప్రభుత్వ భూమిని ముస్లిం గ్రేవ్‌యార్డ్ కోసం కేటాయించాలంటూ వినతిపత్రం అందజేశారు.

డా. శ్రవణ్ మాట్లాడుతూ,
“గ్రేవ్‌యార్డ్ అనేది మతపరమైన హక్కు మాత్రమే కాదు, మానవ హక్కు కూడా. ఈ విషయాన్ని రాజకీయంగా కాకుండా మానవీయంగా చూడాలి,” అన్నారు. అలాగే, గ్రేవ్‌యార్డుల కోసం ఉద్యమించిన ముస్లిం యువతపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తన పాలనలో ముస్లింల సమస్యలపై గంభీరంగా స్పందించిన కేసీఆర్ ప్రభుత్వం, 125 ఎకరాల భూమిని మతపరమైన అంత్యక్రియల కోసం కేటాయించిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం మైనారిటీ సమస్యలను పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే, బోరబండలో ముస్లిం గ్రేవ్‌యార్డుకు భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనారిటీ విభాగం చైర్మన్ ముజీబుద్దీన్, పార్టీ నాయకులు సోహైల్, మొహీద్, అర్షద్, కధీర్, జకీర్ మరియు బోరబండ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
