ఉజ్వల భారతదేశం నిర్మించుకునేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించింది: కేసీఆర్

ఉజ్వల భారతదేశం నిర్మించుకునేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించింది: కేసీఆర్

ఖమ్మం బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగం
ఖమ్మం, జనవరి 18 (విశ్వం న్యూస్) : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గారు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు అఖిలేష్ యాదవ్ గారు, ఇంతకు ముందే మనకు సందేశం ఇచ్చి కేరళకు వెళ్లిన గౌరవనీయులు కేరళ ముఖ్యమంత్రి వర్యులు విజయన్ గారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి, తెలంగాణ ప్రేమికులు గౌరవనీయులు డి.రాజా గారు, వేదికనలంకరించిన సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ గారు, గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంటరీ సభ్యులు గౌరవనీయులు కె.కేశవరావు గారు, నామా నాగేశ్వర్ రావు గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, జెడ్పీ చైర్మన్లు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, ఖమ్మం జిల్లా నలు చెరగుల నుంచి ఖమ్మం చరిత్రలో ఇంత అద్భుతంగా జరుగుతున్న భారీ బహిరంగ సభకు, తరలివచ్చిన నా ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరునా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

మీరంతా ఇంతగా వేచిఉండటం నాక్కూడా చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది.
మీరందరూ ఇంతగా తరలిరావడమే ఈ దేశంలో మార్పుకు సంకేతం.
ఇక బీఆర్ఎస్ సంగతి, నా సంగతి తర్వాత చెప్తాను. మీ సంగతి ముందు చెప్తాను.
ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.10 లక్షల చొప్పున నిధులిస్తున్నం.
అదేవిధంగా 10 వేల జనాభాకు మించి ఉండి, మున్సిపాలిటీలుగా కాకుండా ఉన్న పెద్దతండా, కల్లూరు, ఎదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీల అభివృద్ధికి తలా రూ.10 కోట్ల చొప్పున నిధులిస్తున్నం.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు బాగుచేశారు. అదే స్ఫూర్తితో మంత్రి పువ్వాడ అజయ్ గారు కూడా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు నిధులిస్తున్నం.
అజయ్ గారు పదే పదే చెప్తున్నారు. ఖమ్మం మున్నేరు నదిమీద పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జిని కూడా మంజూరు చేస్తం.
సత్తుపల్లి, మధిర, వైరా మరింత అభివృద్ధి కావాల్సి ఉంది – వీటికి రూ. 30 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నాం.
ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని జేఎన్టీయూ ఆధ్వర్యంలో కొత్త కోర్సులతో మంజూరు చేస్తున్నాం.
చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్క జర్నలిస్టుకూ నెలరోజుల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా అధికారులను, మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ గారిని కోరుతున్నా.
ప్రభుత్వ స్థలం లేకుంటే భూమిని సేకరించి, వీడియో జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇవ్వాలని కోరుతున్నా.
ఇపుడిక దేశం సంగతి చూద్దాం..
ఒకటే మాట నా మనసును అనేక రోజులుగా కలచి వేస్తున్నది.
రాజకీయాలు జరుగుతయి, ఎవరో గెలుస్తరు, ఎవరో ఓడుతరు అయిపోతయి.
ఎందరు గెలవలేదు, ఎందరు ఓడలేదు, ఎందరు ఊడలేదు. ఇది పెద్ద ఇష్యూ కాదు.
ఈ రోజు మన భారతదేశం యొక్క లక్ష్యం ఏమిటి?
భారతదేశం తన లక్ష్యం కోల్పోయిందా, దారి తప్పిందా, బిత్తరపోయి గత్తర పడుతున్నదా? ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో?
ఇది మనందరం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం.
దేశంలో ఎవరినీ అడుక్కునే అవసరంలేని, ఏ ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకోవాల్సిన అవసరం లేనటువంటి, ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనటువంటి, ఏ విదేశీయుల సాయం అవసరంలేని సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు.
లక్షల కోట్ల సహజ సంపద ఉంది. ఏమైతాంది. లేకపోతే బిక్షమెత్తుకోవాలా. సంపద ఉండి కూడా మనం ఎందుకు యాచకులం కావాలె.
అమెరికా మనదేశ భూభాగం కన్నా రెండున్నర రెట్లు పెద్దగుంటది. అమెరికాలో కేవలం 29శాతం సాగుభూమి ఉంది.
చైనా మనకన్నా ఒకటిన్నర రెట్లు పెద్దగుంటది. చైనాలో 16శాతం సాగుభూమి మాత్రమే ఉంది.
మొత్తం భారత భూభాగం 83 కోట్ల ఎకరాలైతే.. అందులో సరాసరి సగం అంటే 41 కోట్ల ఎకరాలు 50 శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉంది.
అపారమైన జలసంపద కురిసే ఈ దేశంలో వర్షపాతం 1 లక్షా 40 వేల టీఎంసీలు – 4000 బిలియన్ క్యూబిక్ మీటర్స్. ఇంటూ 35. అందులో 70శాతం ఆవిరై పోతది. అంటే 70 వేల టీఎంసీలు ఆవిరైపోతే మనం ఉపయోగించుకోగలిగే నీరు 70-75 వేల టీఎంసీలున్నది.
భూమి ఉంది. నీరు ఉంది. పంటలు పండటానికి అవసరమైన సూర్యరశ్మి, సూర్యకాంతి కలిగి ఉన్న దేశం. మూడు ప్రత్యేక ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నవి.
ఇండియాలో యాపిల్ కూడా పండుద్ది. మామిడి కాయలూ పండుతాయి. ఇది ఇతర దేశాల్లో ఉండదు.
కష్టించి పనిచేసే జాతి రత్నాలు 139 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో మెక్ డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లా మనం తినేటివి?
దేశంలో అద్భుతమైన పంటలు పండించి, ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి, సాగునీళ్లని పైకి తెచ్చి, దానికి కనెక్టెడ్ గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టి, అందులో కోటానుకోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి వరల్డ్ బెస్ట్ ఫుడ్ చైన్ గా ఉండాల్సిన ఇండియా ఇవాళ కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటదా? ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమన్నా ఉంటదా?
లక్షకోట్ల రూపాయల విలువైన పామాయిల్ ను దిగుమతి చేసుకుంటమా? ఇది నిజం కాదా? అబద్ధమా, స్టోరీయా?
నేను చెప్తున్న టీఎంసీల లెక్క నాది కాదు. కేంద్ర ప్రభుత్వ వాటర్ కమిషన్ చెప్పిందే. ఇది ఆషామాషీ విషయం కాదు.
దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే, మనం వాడుకునేది మాత్రం 20 వేల టీఎంసీలు మాత్రమే.
75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కోట్లాది మందికి విషపు నీళ్లా ఈరోజు గతి? ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు పాపాత్ములు?
అందుకే నేను ఈ దేశానికో లక్ష్యం ఉందా? అని అడిగిన. మనం లక్ష్యం కోల్పోయినం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో చేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన కొన్ని ప్రాజెక్టులు తప్ప, తర్వాత అతీగతీ లేదు.
ఇక ట్రిబ్యునల్ వేస్తరు. మన రాష్ట్రంలోనే కృష్ణా జలాల వివాదం మీద బ్రజేష్ కుమార్ అనే ట్రిబ్యునల్ వేశారు. 20 ఏండ్లయింది. హరీ లేదు. శివా లేదు. రిటైర్డు జడ్జీలుంటరు. అంతే. 20 ఏండ్లు దాటుతుంటే, ట్రిబ్యునల్ ఉలుకూ పలుకూ లేకపోతే తీర్పు చెప్పేదెప్పుడు. ఆపైన గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్ వాళ్లు క్లియర్ చేసేదెప్పుడు? తర్వాత డిజైన్లు అయ్యేదెప్పుడు? నిధులు సమకూరేదెప్పుడు? ప్రాజెక్టులు కట్టేదెప్పుడు? ప్రజలకు సాగునీళ్లు, తాగునీళ్లు వచ్చేదెప్పుడు? దీనికేమన్నా అమెరికాను అడుక్కోవాల్నా, అంతర్జాతీయ రాజనీతి కావాల్నా? ప్రపంచ బ్యాంకు దగ్గర చిప్ప పట్టుకోవాల్నా? ఏదీ అవసరం లేదు కదా. ఇది ఫ్యాక్టు కదా. ఇది అవసరం లేదు.

మంచినీళ్లియ్య చాతగాదు.. నదులల్ల పారే నీళ్లు సముద్రానికి వృథాగా పోతుంటే, నోర్లు వెళ్లబెట్టుకొని కహానీలు చెప్పి, కథలు చెప్తరు. ప్రజలను గోల్ మాల్ చేస్తరు.
మన వలెనే నీటి వనరులున్న ఇతర దేశాల్లో నీళ్లు బాగా వాడుకుంటున్నరు.
జింబాబ్వే అనే చిన్న దేశంలో జాంబేజి నది మీద 6,533 టీఎంసీల ప్రాజెక్టు ఉంది.
రష్యాలో అంగారాలో నది మీద 5,968 టీ.ఎం.సీ.ల ప్రాజెక్టు ఉంది.
ఆఫ్రికా ఖండంలోని ఘనా దేశంలో ఓల్టా నదిపై 5,085 టీ.ఎం.సీ.ల ప్రాజెక్టు ఉంది.
కెనడాలో మనీకూగాన్ నదిపై 4,944 టీ.ఎం.సీ.ల ప్రాజెక్టు ఉన్నది.
ఈజిప్టులో నైలు నది మీద 4,561 టీ.ఎం.సీ.ల ప్రాజెక్టు ఉంది.
మన పొరుగుదేశమైన చైనాలో యాంగ్సీ నది మీద 1400 టీ.ఎం.సీ.ల త్రీగార్జెస్ ప్రాజెక్టు ఉన్నది.
అమెరికాలో కొలరాడో నది మీద 1200 టీ.ఎం.సీ.ల ప్రాజెక్టు ఉంది.
మరి మన దేశానికేదండీ. ఇంత సువిశాల దేశం. 139 కోట్ల జనాభా. కరువులు చూసినం, కాటకాలు చూసినం, వరదలు చూస్తున్నం. ఏదీ ఒక్క ప్రాజెక్టు కూడా వద్దా మన మొఖానికి? మనం నోచుకోలేదా? మంచినీళ్లకు బాధ పడాల్నా.
ఈ ఖమ్మం సభ ద్వారా నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతున్నా. ఈ దేశంలో సరైన పరిపాలన వచ్చి, నదుల నీళ్లన్నీ భూమ్మీదకు మళ్లి, ప్రజల దాహాన్ని, పొలాల దాహాన్ని తీర్చాల్నా. మనం సన్నాసుల్లాగా ఇట్లనే ఉండాల్నా. దయచేసి దేశం ఆలోచించాలని నేను కోరుతున్నా. ఇది ప్రశ్నించడానికి, ఈ చైతన్యం తేవడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్. ఆరునూరైనా సరే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాన్ని తెచ్చి అయినా సరే, కేంద్రంలోని ప్రభుత్వం మెడలు వంచి సహజ సిద్ధంగా భగవంతుడిచ్చిన ఈ ప్రకృతి సంపద అందరికీ అందిస్తం.
ఇప్పటిదాకా ప్రజలు వంచించబడ్డరు. మనం ముందుకు పోవాలె.
ఒక బకెట్ నీళ్ల కోసం చారిత్రాత్మక నగరం చెన్నై పరితపించాల్నా? ఆ బాధను కె.బాలచందర్ ‘‘తన్నీర్ తన్నీర్’’ అని సినిమా తీస్తే కూడా మనకు సిగ్గు రాదా? ఇంకా లొడా లొడా రాజకీయాలు మాట్లాడటం, గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పడం ఎందుకు. ఇదేనా భారతదేశం యొక్క పరమార్ధం.
నీటి యుద్ధాలు ఎందుకండీ? ఇపుడే పంజాబ్ సీఎం చెప్పారు.
మహానది నీళ్ల కోసం ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ కొట్లాడుకోవాలా?
సట్లెజ్, దాని ఉప నదులైన రావి, బియాస్, చీనాబ్ నదుల జలాల కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ కొట్లాట.
నర్మదా జలాల కోసం గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ మధ్య కొట్లాట.
కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక కొట్లాట?
కృష్ణా, గోదావరి నదుల నీళ్ల కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల మధ్య పంచాయతీ. ఇవి ఇట్లనే కొనసాగుతూనే ఉండాల్నా
చాట్ల తౌడు పోసి, కుక్కల కొట్లాట పెట్టినట్లు, రాష్ట్రాల మధ్య తగువులాటలు పెట్టి, చాతగాక, పరిపాలన చేయరాక, చట్ట స్ఫూర్తి లేక, డొల్ల మాటలు, కల్లమాటలు చెప్పే పరిపాలకులే ఉండాల్నా? నిజాయితీగా పనిచేసే వాళ్లుండాల్నా?
ఈరోజు మనం కాళేశ్వరం కట్టుకోలేదా? పాలమూరు పరుగులు పెడుత లేదా? ఖమ్మంలో సీతారామ పరుగు పెడుతలేదా? దీన్ని ప్రశ్నించడానికి, సాధించడానికి సహజ సిద్ధంగా ఉన్న ప్రజల ఆస్తిని వినియోగించి, దేశ ప్రజలను కష్టాల నుంచి విముక్తి చేసేందుకు పుట్టిందే బీఆర్ఎస్.
ఈ దుర్మార్గానికి కారణం కాంగ్రెస్ – బీజేపీ. దొందూ దొందే
వాళ్లను వీళ్లు తిడుతుంటరు, వీళ్లను వాళ్లు తిడుతుంటరు. ఇట్లనే ఉండాల్నా, మనకు నీళ్లు రావాల్నా ఆలోచించాలె.
అదేవిధంగా కరెంటు.. ఈ దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు 4 లక్షల 10 వేల మెగావాట్లు.
కానీ, దేశంలో ఏనాడూ 2 లక్షల 10 వేల మెగావాట్లకంటే ఎక్కువ వాడలే.
అనేక వేల మెగావాట్ల ధర్మల్ పవర్ స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే వాటిని మూలకు పెట్టి కూర్చున్నరు, దేశమంత కరెంటు కోతలు. తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా 24 గంటలు కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. ఏడేండ్ల కింద మన గతి ఎట్లుండె. బీఆర్ఎస్ లాంటి భావజాలమున్న పార్టీలు అధికారంలోకి వస్తే రెండేండ్లలో తెలంగాణలాగా వెలిగిపోయే భారత దేశాన్ని తయారు చేస్తం. చాలెంజ్
రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమంటే 96 కథలు చెప్తరు.
రేవిడీ కల్చర్ అని రైతులకిచ్చేవి ఉచితాలని ఆగం చేస్తరు.
దేశంలో వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు.
అన్ని ఉన్న ఈ దేశంలో రైతులు 13 నెలలపాటు నిరసనలు చేసే దుస్థితి ఎందుకు?
ఇదేనా ఈ దేశానికి కావలసింది. ఇదేనా పాలించే విధానం.
వారికి ఇష్టమున్నవారికి 14 లక్షల కోట్ల రూపాయలను ఎన్పీఏల పేరుతో దోచిపెడుతున్నరు.
తెలంగాణలో చేస్తున్నట్లుగానే భారత దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా ఇచ్చి తీరాలె. దానికయ్యే ఖర్చు 1 లక్షా 40 వేల కోట్లు మాత్రమే. రేపు బీఆర్ఎస్ గవర్నమెంటో, బీఆర్ఎస్ ప్రతిపాదించే గవర్నమెంటో వస్తే, భారతదేశం మొత్తానికి తెలంగాణ మాదిరిగానే రైతులకు ఉచిత కరంటు సరఫరా చేస్తం.
రైతుల ఆత్మహత్యలు ఆపాలని, వారిని బాగు చేయాలని రైతుబంధు ఇస్తే దానిమీద కథలు చెప్తరు. మళ్లా వాళ్లే ఒప్పుకొని వాల్లే ఇస్తరు. తెలంగాణలాంటి రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనేదే బీఆర్ఎస్ నినాదం. డిమాండ్.
సోషలైజేషన్ ఆఫ్ ది లాసెస్.. ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్.. బీజేపీ విధానం.
అయ్యా మోడీ గారూ.. మీ బీజేపీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే – మా బీఆర్ఎస్ పాలసీ నేషనలైజేషన్.
అమ్ముతా అమ్ముతా అంటున్నవు ఎల్.ఐ.సి.ని ఫర్వాలేదు. 2024 తర్వాత నువ్వు ఇంటికి. మేం ఢిల్లీకి. గ్యారంటీగా ఎల్ఐసీని వాపస్ తీసుకుంటం. పబ్లిక్ సెక్టార్ లోనే కొనసాగిస్తం.
ఎల్.ఐ.సి.కి 42 లక్షల కోట్ల ఆస్తులున్నయి., లక్షలాది మంది ఏజెంట్లు ఇతర ఉద్యోగులున్నరు.
ఎల్ఐసీకి భారతీయ ఆత్మతో పెనవేసుకొని పోయిన పేగు బంధం ఉన్నది.
దాన్ని అప్పనంగా, అడ్డికి పావుసేరు చొప్పున ఇష్టం వచ్చిన షావుకార్లకు అమ్ముతానని మోడీ చూస్తున్నడు.
మోడీ గారూ నువ్వు అమ్మినా.. మళ్లా మేం వాపసు తీసుకుంటం. ఎల్ఐసీ ఏజెంటు మిత్రులారా, కార్మికులారా, సింహాల్లాగా గర్జించండి, పిడికిలెత్తండి. బీఆర్ఎస్ ను బలపర్చండి. ముందుకు పోదాం. మన ఎల్ఐసీని రక్షించుకుందాం.
అదేవిధంగా లక్షల కోట్ల రూపాయల విలువైన కరంటు సంస్థలను లాస్ చూపి అమ్ముతరట.
ప్రగతి సూచికల్లో మొదటిదైన కరంటును బీఆర్ఎస్ ప్రభుత్వరంగంలోనే ఉంచుతది. కరంటు కార్మికులారా.. పిడికిలి బిగించండి.
కరంటు, నీళ్లివ్వని అసమర్థ పాలకులు కావాల్నా ఆలోచించండి.
అంగట్ల అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని ఉన్నట్లు ఎందుకు మోసపోవాలె.
దేశంలో లక్ష మెగావాట్ల హైడ్రో పవర్ ఉత్పత్తికి అవకాశం ఉంది.
బిహార్ లోని కోసి, గండకీ నదుల మీద జల విద్యుదుత్పత్తి కేంద్రాలు నిర్మిస్తే, వరదలు తగ్గడమే కాకుండా జల విద్యుత్ లభిస్తది.
మోడీ గారి ప్రవచనం –Government has no business to do business.
కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే..
But We say Government has the business to do business where it is required.
ధనవంతులు ధర్మశాలలు కట్టించిన చరిత్ర మనది.
ఇక దళితజాతి బిడ్డలు ఎవరికోసం,ఎన్నేండ్లు వివక్ష అనుభవించాలె.
అందుకే పుట్టింది తెలంగాణలో దళితబంధు. అంబేద్కర్, కాన్షీరాం గారి బాటలో దళితజాతి పైకి వచ్చి తీరాలె. భారత దళితజాతికి నేను పిలుపు ఇస్తున్నా.. తెలంగాణలో వలె దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని ఏడాదికి 25 లక్షల కుటుంబాలకు అమలు చేయాలె.
మీరు దళితబంధు అమలు చేయకుంటే, బీఆర్ఎస్ చేస్తదది.
మహిళలు భాగస్వాములైన దేశాలు బాగున్నయి. దేశంలో మహిళలు లింగవివక్షకు గురవుతున్నరు. ఇది పోవాలె. మహిళల పాత్రను అన్నిరంగాల్లో పెంపొందించాలె.
బీఆర్ఎస్ పాలసీగా పార్లమెంటులోనూ, చట్టసభల్లోనూ సీట్ల సంఖ్యను 33శాతం పెంచి, మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేస్తుంది.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మోడీ గారు అమ్ముతరట. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోనివ్వం. మళ్లీ తీసుకొని పబ్లిక్ సెక్టార్లో పెడతం. ఇది మా వాగ్దానం.
కేంద్ర పాలకులు రైళ్లమ్ముతున్నరు. విమానాలమ్ముతున్నరు. రోడ్లు పోయినయి. వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు చేసి, కార్పొరేట్ గద్దలకిస్తరట. మన భూములు వాళ్లకిచ్చి, అందులో మనమే జీతాలు చేయాలట. మేం వీటిని అడ్డుకుంటం.
పొరుగున ఉన్న చైనా దేశం అభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుంది.
అణుబాంబుతో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోనే సాటిలేని మేటి దేశంగా వెలుగుతున్నది.
ఏమీలేని సింగపూర్ ప్రబల ఆర్ధికశక్తిగా ఎదిగింది. ఇంకా దక్షిణ కొరియా తదితర దేశాల విజయగాథలు ఎన్నో మన ముందున్నాయి.
తాగడానికి మంచినీళ్లివ్వడం కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి చేతగాదు. అందుకే మా విపక్షాల ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. తెలంగాణలోలాగా మిషన్ భగీరథ పథకాన్ని బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా అమలు చేస్తది. ఇది బీఆర్ఎస్ పాలసీ.
నిరుద్యోగ సమస్యను నివారించేందుకు అత్యుత్తమమైన పారిశ్రామిక ఐటీ పాలసీని బీఆర్ఎస్ త్వరలోనే ప్రకటిస్తుంది.
మన దగ్గర మేక్ ఇన్ ఇండియా, జోక్ ఇన్ ఇండియా అయిపోయింది. పేటకో పూటకో చైనా బజార్లుంటయి.
సైన్యంలో కేంద్రం అగ్నిపథ్ ను ప్రవేశపెట్టింది. విపక్షాల ప్రభుత్వం బీఆర్ఎస్ అధ్వర్యంలో దీన్ని రద్దు చేసి, పాత పద్ధతినే కొనసాగిస్తది.
కేంద్రం తన అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ప్రతిపక్షాలను వేధిస్తున్నది.
మత విద్వేషాలు మంటలు రేపి, యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నరు.
సర్వ ధర్మ సమభావనే, సకల జనుల సంక్షేమమే భారత సంస్కృతి పరంపర. ఆ మత విద్వేషపు విష వృక్షాలు పెరిగి పెద్దవై జాతి జీవనాడిని దహించివేస్తుంటే, ఎవరికోసం మనం సహించాలె. ఎందుకోసం సహించాలె. కాబట్టి కర్షక వీరులు, కరంటు సోదరులు, మహిళా సోదరీమణులు, దళితబిడ్డలకందరికీ ఒక్కటే మనవి చేస్తున్నా. అందరం ఏకమైతే ఈ మూర్ఖుల, అసమర్థుల పాలనను తొలగించడం కష్టం కాదు. ఉజ్వల భారతదేశం నిర్మించుకునేందుకే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పాలసీలన్నీ ఈ దేశ ప్రజల ముందు పెడతాం. వీటిమీద రిటైర్డు ఐఏఎస్ అధికారులు, సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు 150 మంది అధ్యయనం చేస్తున్నారు. ఫైనల్ డ్రాఫ్టింగ్ జరుగుతున్నది. దాన్ని త్వరలోనే దేశం ముందు చర్చకు పెడతం. సీపీఐ, సీపీఎం లాంటి క్రియాశీల, ప్రగతిశీల పార్టీలతో భారతదేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ కలిసి పనిచేస్తది. బ్రహ్మాండంగా ముందుకు పురోగమిస్తం. అంతిమ విజయం మనదే.. మనదే.. మనదే.. న్యాయం, ధర్మం ఎప్పుడూ గెలిచి తీరుతది.
ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చి దీవించి, విజయవంతం చేసిన ప్రజలందరికీ, సభ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *