అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సి.ఎస్
హైదరాబాద్, మార్చి 25 (విశ్వం న్యూస్) : ట్యాంక్ బండ్ పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో 125 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న భారీ అంబేద్కర్ విగ్రహా పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ అంబెడ్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజున, ఏప్రిల్ 14 న, ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ విగ్రహ పనుల పురోగతిని నేడు సాయంత్రం సి.ఎస్ పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఈ.ఎన్.సి గణపతి రెడ్డి లతో కలసి పనులను పరిశీలించిన, శాంతి కుమారి ఈ పనులన్నింటినీ ఏప్రిల్ 10 తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఈ విగ్రహ క్రింది భాగంలో నిర్మిస్తున్న వందమంది పట్టే కెపాసిటీ కలిగిన యాంపి థియేటర్ పనులను పరిశీలించారు.
ఈవిగ్రహ ఆవరణలో ఏర్పాటుచేస్తున్న ల్యాండ్ స్కేపింగ్ పనులు, ఇతర సివిల్ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, దీనికి ముందు బిఆర్ అంబేద్కర్ సెక్రెటేరియేట్ నిర్మాణ పనుల పురోగతిని కూడా పరిశీలించారు.