మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి
ప్రకటన – అభిమానులకు శుభవార్త

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విశ్వం న్యూస్) : తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న చిరంజీవి గారు, తన కుటుంబానికి సంబంధించిన ఓ శుభవార్తను మంగళవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. తన మనవడు మార్క్ శంకర్ తాజాగా ఇంటికి తిరిగొచ్చినట్టు, కానీ ఇంకా పూర్తిగా కోలుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.
సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ఒక భావోద్వేగపూరితమైన ట్వీట్ చేస్తూ, ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ మామూలుగా వుంటాడు’’ అని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ, రేపు హనుమత్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి తమ కుటుంబానికి రక్షణ కల్పించాడని, పెద్ద ప్రమాదం నుంచి మార్క్ శంకర్‌ను రక్షించాడని చెప్పారు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న అభిమానులు తమ మనస్పూర్తి ప్రార్థనలతో, ఆశీస్సులతో కుటుంబానికి అండగా నిలుస్తున్నారని అన్నారు.

చివరగా, ‘‘నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ అభిమానులకి తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్‌కు ఎంతో ఊరట లభించింది. ప్రస్తుతం అభిమానులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.