మంచి నీళ్లివ్వండి మహాప్రభో!

- దాహార్తి తీర్చాలంటూ తలారి చంద్రశేఖర్ వినతి
- శివ సాయి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీవాసుల ఆవేదన
బండ్లగూడ జాగిర్, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొదటి వార్డు శివ సాయి నగర్ మరియు వెంకటేశ్వర నగర్ కాలనీవాసులు మంచినీటి కోసం మరోసారి అధికారుల వద్ద వినతులు చేస్తున్నారు. ఈ రోజు మాజీ కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ గారి నేతృత్వంలో, కాలనీల అధ్యక్షులు మరియు ప్రజలు కలిసి హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి ఐఏఎస్ గారిని కలిసి మంచినీటి సమస్యను ప్రస్తావించారు.
కె. అశోక్ రెడ్డి గారు సమస్యపై సానుకూలంగా స్పందిస్తూ, మరో 15 రోజుల్లో మంచినీటి సరఫరా ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు. కానీ ఇదే మాటలు సంవత్సరాలుగా విన్న ప్రజలు ఇప్పటికీ నిశ్శబ్ద నిరీక్షణలో ఉన్నారు. కాలనీలకు ట్యాంకులు వేసినప్పటికీ ఇప్పటికీ ఒక్క బొట్టు నీరు రాలకపోవడం బాధాకరమని వారు చెబుతున్నారు. ప్రజలు చెబుతునట్లుగా, “డ్రైనేజ్‌లు, సీసీ రోడ్లు వేసే ముందు వాటర్ కనెక్షన్ కోసం FAN నెంబర్ తీసుకుని, రెగ్యులర్‌గా బిల్లులు చెల్లిస్తున్నాం. కానీ నీటి సరఫరా మాత్రం లేదు. ఇది ఎలాంటి న్యాయం?”
ఈ సమావేశంలో శివ సాయి నగర్ కాలనీ అధ్యక్షుడు రమణారెడ్డి, రామారావు, రమేష్ సాగర్ మరియు వెంకటేశ్వర నగర్ కాలనీ అధ్యక్షుడు కృష్ణా సాగర్ పాల్గొన్నారు. ప్రజలు అధికారుల వద్ద ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకక పోవడం వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
స్థానిక ప్రజలు ఇప్పటికైనా తమ కష్టాలు తీరాలని, నిత్యావసరమైన మంచినీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.