యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం గురించి వివరించిన సీఎం కేసీఆర్
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం గురించి వివరించిన సీఎం కేసీఆర్

యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం గురించి వివరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జనవరి 18 (విశ్వం న్యూస్) : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించిన సందర్భంలో స్థల పురాణాన్ని, ప్రాశస్త్యాన్ని సీఎం వారికి తెలిపారు. గతంలో ఈ ఆలయం ఉన్న ఫొటోలను, ప్రస్తుతం పునర్నిర్మాణం జరిగిన తర్వాత తీసిన ఫొటోలను ముఖ్యమంత్రి కేసీఆర్ సహచర సీఎంలు, ముఖ్యనేతలకు చూపిస్తూ, ఆలయ పునర్నిర్మాణం జరిపించిన తీరును వివరించారు. గతంలో యాదగిరిగుట్టపై ఆలయం కేవలం అర ఎకరం స్థలంలో మాత్రమే ఉండేదని, దాన్ని ఇపుడు నాలుగు ఎకరాల స్థలానికి విస్తరించి, అభివృద్ధి జరిపిన తీరును సీఎం కేసీఆర్ వారికి వివరించారు. సిమెంటు లేకుండా పూర్తిగా కృష్ణశిలతోపాటు, ఆలయ నిర్మాణానికి కావాల్సిన ఇతర స్టోన్స్ ను దేశంలోని ఇతర ప్రాంతాల నుండి తెప్పించి, వివిధ రాష్ట్రాలోని నిపుణులైన స్తపతులతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు సీఎం కేసీఆర్ వారికి తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ కాంప్లెక్సును నిర్మించినట్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆ తర్వాత వారు అద్దాల మంటపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ తర్వాత విజిటర్స్ బుక్ లో ఆలయ గొప్పతనం గురించి అతిథులు తమ అభిప్రాయాన్ని నమోదు చేశారు. అనంతరం వారంతా శివాలయానికి చేరుకొని స్వామివారి పూజలో పాల్గొన్నారు. అర్చకులు వారికి ఆశీర్వచనంతోపాటు, తీర్థ ప్రసాదాలు అందించారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు ప్రశంసించారు. అనంతరం వారంతా ఆలయం నుండి ప్రెసిడెన్సియల్ సూట్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఆ సూట్ నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని, టెంపుల్ సిటీని చూపించారు. అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రెసిడెన్షియల్ సూట్ నుండి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, టెంపుల్ సిటీ, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం వారు హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, సీఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్, ఆర్డీఓ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆ తర్వాత యాదగిరి గుట్ట నుంచి వారందరూ రెండు హెలీకాప్టర్లలో ఖమ్మం బయలుదేరి వెళ్లారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు..
అక్కడి నుంచి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రధాన ఆలయానికి ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు, ముఖ్య అతిథులుగా వచ్చిన ఇతర ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలకు ఆలయ, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి కుంకుమబొట్టు పెట్టి స్వాగతించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్య నేతలంతా ఆలయంలోకి ప్రవేశించగానే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ధ్వజస్థంభ ప్రదక్షిణ గావించారు. ఆలయ గర్భగుడిలో మూల విరాట్ స్వయంభూ శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రధాన అర్చకులు, వేద పండితులు సంకల్పం చెప్పి, సువర్ణ పుష్పాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. వారందరికీ హారతి, తీర్ధ ప్రసాదాలు అందించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు మంత్రోచ్ఛరణలతో వేద ఆశీర్వచనం అందించారు. ముఖ్య అతిథులకు ఆలయ అధికారులు స్వామివారి విగ్రహాలను అందించి, శాలువాలతో సత్కరించారు.

