కాళేశ్వరం పై కాంగ్రెస్‌ దుష్ప్రచారం: మండలి బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ మధుసుధనాచారి ఆరోపణ

కాళేశ్వరంపై
కాంగ్రెస్‌ దుష్ప్రచారం

హైదరాబాద్‌, మే 5 (విశ్వం న్యూస్‌): తెలంగాణలో 16 నెలల అసమర్థ పాలనను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని మండలి బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ సిరికొండ మధుసుధనాచారి ఆరోపించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద సోమవారం జరిగిన “కాళేశ్వరం పై కాంగ్రెస్ కుట్రలు – వాస్తవాలపై చర్చా కార్యక్రమం”లో ఆయన మాట్లాడారు.

మధుసుధనాచారి మాట్లాడుతూ: సమైఖ్యాంధ్ర పాలనలో వలసవాదులు తెలంగాణ నీటి హక్కులను హరించారని, నీటి సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్‌ ఉత్సాహంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశారని, కాకతీయుల ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ కుట్రలు:
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మధుసుధనాచారి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, చిన్న పిల్లర్ సమస్యను బూతద్దంలో చూపించి ప్రజలను తప్పుదారి పట్టించాలనుకుంటున్నారని విమర్శించారు. ఎన్డీఎస్‌ఏ నివేదిక ప్రకారం పిల్లర్‌కు మరమ్మతులు చేయగలమని పేర్కొన్నారని, అవినీతిపై ఎటువంటి ఆరోపణలు లేవని తెలిపారు.

బ్యారేజీలు కూలిపోవాలన్నదే సీఎం ఆశయం: నీటి నిపుణులు వి. ప్రకాశ్: సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశ్యం బ్యారేజీలు కూలిపోవాలని అన్నారు. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ కుంగిపోయిన అంశంపై ఎన్నికలకు ముందు నుంచే కుట్రలు పడ్డాయని ఆరోపించారు. సమైఖ్యాంధ్ర పాలనలో నీటి రంగంలో జరిగిన అన్యాయం ఇప్పటికీ కొనసాగుతోందని వివరించారు.

మంథని ప్రజలను మోసగించిన ఎమ్మెల్యే: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్-మంథని నియోజకవర్గ ప్రజలను నమ్మించి మోసగించడంలో మంథని ఎమ్మెల్యే పాత్ర ఉందన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. చిన్న కాళేశ్వరం భూసేకరణను పరిశీలించి, ప్రజాభిప్రాయం ఆధారంగా ముందుకు సాగించాలని సూచించారు.

సమావేశంలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, నడిపెల్లి దివాకర్ రావు, కోరుకంటీ చందర్, దుర్గం చిన్నయ్య, జక్కు శ్రీ హర్షిణీ తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *