రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామాలు అభివృద్ధి
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి, జనవరి 24 (విశ్వం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామాలు అభివృద్ధి సాధిస్తున్నాయి అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంథని మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంథని మండలం దుబ్బపల్లి గ్రామపంచాయతీలో సుమారు 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మంథని మండలం లోని రచ్చపల్లి గ్రామంలో కోటి నాలుగు లక్షలతో నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను, సుమారు 71 లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి అని, ప్రతి వ్యక్తి సంక్షేమం దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తుందని అన్నారు. అనంతరం మంథనిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.