ధరణి ఉండాలా తీసేయాలా ?

కుమురం భీమ్, జూన్ 30 (విశ్వం న్యూస్) : చిరకాల స్వప్నంగా ఉండిపోయిన ‘మావ నాటే మావ రాజ్’ నినాదం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలోనే సాకారమైందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ‘పేదలే దేవుళ్ళుగా’ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలబెట్టిందని అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ గారు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘జల్ జంగల్ జమీన్’ నినాదమిచ్చిన గిరిజన యోధుడు కుమురం భీమ్ పేరు మీదుగా ఏర్పడిన జిల్లా నుంచే పోడు భూములు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవడం చారిత్రక సందర్భమని సీఎం కేసీఆర్ గారు అన్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్ ప్రగతి నివేదన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం….

• తెలంగాణ ఉద్యమంలో భాగంగా నేను ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మావ నాటే మావ రాజ్‌ (మా గూడెంలో మా రాజ్యం, మా తండాలో మా రాజ్యం) అని చెప్పేవారు. అనేక దశాబ్దాలు మీరు పోరాటం చేసినా అది సాధ్యం కాలేదు.
• బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో మూడు నుండి నాలుగు వేల గిరిజన తండాలను, గూడేలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాక, కుమురం భీమ్ పేరు మీద కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం.
• మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు నడిచారు కాబట్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ వచ్చింది కాబట్టే కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వచ్చింది.
• ఈ రోజు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు.
• ఒకప్పుడు బెజ్జూరు నుండి ఆదిలాబాద్ కు పోవాలంటే చాలా బాధపడేవారు. కానీ నేడు మీ ముంగిట్లో జిల్లా ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయం, మరెన్నో కార్యాలయాలు అందుబాటులోకి రావడం చాలా సంతోషం కలిగించే విషయం.
• ఒకప్పుడు వర్షం పడితే ‘మంచం పట్టిన మన్యం’ అని వార్తలు వచ్చేవి. అంటువ్యాధులతోని సతమతమై ఆదిలాబాద్ బిడ్డలు చనిపోయేవారు.
• నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందుతున్నది. వైద్య వ్యవస్థను బాగు చేసుకున్నాం. కాబ్టీ మన్యం మంచం బట్టే పరిస్థితి లేదు. గత 3 సంవత్సరాలుగా అలాంటి దుస్థితి నుంచి మనం బయటపడ్డాం.
• మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ లో మెడికల్ కాలేజీని సాధించుకున్నారు.
• కోనేరు కోనప్పగారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపించుకున్నారు. నేడు మహారాష్ట్ర పోవడానికి కౌటాల మండలం నుంచి వార్ధా నది మీద బ్రిడ్డి కావాలని కోరారు. 75 కోట్ల రూపాయాలతో మంజూరు చేసిన జీవోనో మీ ముందే వారికి అందిస్తున్నాను. ఐటిఐ కాలేజీ కూడా ఆసిఫాబాద్ కు మంజూరు చేస్తున్నాం.
• నాగమ్మ చెరువును మినీ ట్యాంకు బండ్ గా, పర్యాటక కేంద్రంగా మారుస్తాం.
• తెలంగాణ వచ్చాక అనేక పేదలను దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలు తెచ్చాం
• ఈ రోజు ఒక్క కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోనే 47 వేల ఎకరాల పోడు పట్టాలను గిరిజనులకు అందిస్తున్నాం. నేను కలెక్టరేట్ లో డజను మందికి పట్టాలు అందించాను. రేపటి నుండి మీ మంత్రిగారు, ఎమ్మెల్యే 47 వేల ఎకరాల భూముల పట్టాలను అందిస్తారు. రాబోయే మూడు , నాలుగు రోజుల్లో ఆ పట్టాలు మీకందుతాయి. ఈ పట్టాలు పొందిన వారికి ఈ పంట నుండే రైతుబంధును కూడా అందిస్తాం.
• త్రీ ఫేజ్ కరెంటు సదుపాయం లేని ఆదివాసి, గిరిజన బిడ్డల పొలాలకు రెండు మూడు నెలల్లో ఆ సదుపాయం కల్పిస్తాం.
• పోడు భూములకు సంబంధించి ఆదివాసి, గిరిజన బిడ్డల మీద నమోదైన కేసులను ఎత్తివేస్తున్నాం.
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెట్టుకొకరు, పుట్టకొకరమై అనేక బాధలు పడ్డాం. అనేక కష్టాలు పడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
• ఇండియాలోనే లేనటువంటి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేసుకుంటున్నాం. పుట్టిన పసిపాప నుండి వృద్ధుల వరకు ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయి.
• అంతకుముందు గ్రామాలు ఎట్లా ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నవో మీకు తెలుసు
• బ్రహ్మాండంగా ముందుకు పోతున్న రాష్ట్రంలో కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నారు
• కాంగ్రెస్ పార్టీవారు ధరణి తీసేస్తమని చెప్తున్నారు. ధరణి తీసేస్తే పైరవికారులు మళ్ళీ భయంకరంగా ప్రజల మీద పడి దోచుకుంటారు. వీరికి దూరంగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను
• నేను ఎక్కడికి పోయినా ప్రజల్ని ధరణి పై అడుగుతున్నాను. ధరణి ఎత్తేస్తే మళ్ళీ పైరవీకారుల బెడద మొదలైతదని ప్రజలు అంటున్నారు.

• ధరణి ఉండాలా తీసేయాలా ?
(ధరణి ఉండాలి అంటూ ప్రజలు చేతులెత్తి స్పందించారు)
• ధరణి పోతే అనేక సమస్యలు మళ్ళీ మొదలైతయి. రైతుల కోసం, ప్రజల కోసం ఆలోచించి ధరణి పోర్టల్ ను తెచ్చాం
• కరెంటు కోసం ఎంత గోస పడ్డామో మీకు తెలుసు. ఇవ్వాళ రైతులు రాత్రులు బావుల వద్దకు పోవాల్సిన అవసరం లేకుండా 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం
• అనేక రంగాల్లో మనం నెంబర్ వన్ గా కొనసాగుతున్నాం. తలసరి ఆదాయంలో, ఇంటింటికి తాగునీరు ఇచ్చే విషయంలో, గర్భిణులకు ఇచ్చే కేసీఆర్ కిట్, రైతులు చనిపోతే ఇచ్చే రైతు బీమా, రైతుబంధు ఇలా గొప్ప గొప్ప పథకాలను అమలు చేసుకుంటున్నాం.
• గతంలో రైతు చనిపోతే ఆపద్బంధు పథకం కింద చెప్పులు అరిగేట్టు తిరిగితే సంవత్సరానికి కూడా 10 వేలో, 20 వేలో ఇచ్చేవారు కాదు. నేడు రైతు ఏ కారణం చేత చనిపోయినా ధరణి పుణ్యమా 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లలో జమ అవుతున్నాయి.
• ఈ రోజు రైతుబంధు డబ్బులు మీ అకౌంట్లలోనే పడుతున్నాయి. విత్తనాలకు, ఎరువులకు ఈ డబ్బులను ఉపయోగించుకుంటున్నారు.
• గతంలో ఆసిఫాబాద్ ప్రాంతానికి మంచి రోడ్డు సదపాయం లేకుండేది. ఇప్పుడు మంచిర్యాల నుండి ఆసిఫాబాద్ కు 4 లైన్ రోడ్డు సదుపాయం వచ్చింది. అది మీరు స్వయంగా అనుభవిస్తున్నారు. మీరు బ్రహ్మాండమైన అభివృద్ధిని చూస్తున్నారు.
• సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలోని అనేక గ్రామపంచాయతీలు తమను తెలంగాణలో కలపమని కోరుతున్నాయి. మహారాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. బిఆర్ఎస్ పాలన కావాలని, రైతు పథకాలు కావాలని వారు కోరుతున్నారు.
• మీ దీవనతోనే బ్రహ్మాండంగా ఉద్యమించి, నేను ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలన్నీ పేద ప్రజలకు ఉద్దేశించినవే. పేదలే దేవుళ్ళుగా ప్రభుత్వం పనిచేస్తున్నది.
• గిరిజన కళాశాలల్లో చదివే విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలలో సీట్లు సాధిస్తున్నారు. బ్రహ్మాండంగా పురోగమిస్తున్నారు.
• ఆదివాసీ, దళిత, మైనార్టీ, బిసిల బిడ్డల్లో ఎవరైతే నిరుపేదలున్నరో వారి ప్రగతి కోసం కంకణం కట్టుకొని బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది.
• ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అన్ని రకాలు కార్యక్రమాలు గ్రామాల్లో అమలవుతున్నాయి
• ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో గిరిజన గ్రామపంచాయతీలు 166, కాగజ్ నగర్ మున్సిపాలిటి ఉంది. ఆసిఫాబాద్ కూడా మున్సిపాలిటి అయింది. త్వరలోనే దీనికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు.

• ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలకు చెరో 25 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నిధి నుంచి మంజూరు చేస్తున్నాను
• 335 గ్రామపంచాయతీలకు ప్రతి పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నాం. ఆయా గ్రామ సర్పంచ్ లు ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించుకోవాలి.
• ఇవ్వాల గ్రామాల రూపురేఖలు ఎలా మారాయో మీకు తెలుసు.
• ఎప్పుడు అవార్డులు వచ్చినా 20 గ్రామపంచాయతీలకు వస్తే అందులో 19 మన గ్రామ పంచాయతీలే ఉంటున్నాయి. 10 అవార్డులు వస్తే అందులో 9 మన గ్రామాలకు వస్తున్నాయి. గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రెడిట్ గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లకే దక్కుతుంది.
• ప్రతి గ్రామపంచాయతీ సకల సౌకర్యాలతో గొప్పగా పురోగమిస్తున్నది.
• మంచిర్యాల జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ఏడు మున్సిపాలిటీలకు చెరో 25 కోట్ల రూపాయలు, 311 గ్రామపంచాయతీలకు చెరో 10 లక్షల రూపాయలు ప్రకటిస్తున్నాను.
• మన అంతిమ లక్ష్యం పరిశుభ్రమైన మంచినీళ్ళు, పల్లె దవాఖాన, ప్రజారోగ్యం, పేద పిల్లలకు బడులు అన్ని కార్యక్రమాలు గ్రామాల్లో జరిగితే బ్రహాండంగా ఉంటుంది.
• వార్ధా నది బ్యారేజీ మంజూరు అయింది. దాదాపు 76 నుంచి 86 వేల ఎకరాలకు నీళ్ళు తెచ్చిచ్చే బాధ్యత నాది. వార్ధా నది నీళ్ళతో మీ రెండు నియోజకవర్గాలకు నీళ్ళు వస్తాయి.
• భారీ సంఖ్యలో హాజరైన మీ అందరి ప్రేమకు ధన్యావాదాలు
• మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు చేసుకుందాం.
• ప్రతి గిరిజన తండాకు రాబోయే రెండు నెలల్లో త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తుంది. ఈ దిశగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కృషి చేయాలి.
• రాష్ట్రవ్యాప్తంగా పంచే 4 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీ కార్యక్రమం జల్ జంగల్ జమీన్ నినాదమిచ్చిన కుమురం భీమ్ జిల్లా నుంచే ప్రారంభించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది.

పోడు భూముల పట్టాల పంపిణీలో హృద్యమైన సంఘటన
పోడు భూముల పట్టాల పంపిణీ సందర్భంగా పట్టా అందుకుంటున్న గోల్డ్ మహిళ కాగజ్ నగర్ ఎన్జీవోస్ కాలనీ టేకం జానూబాయి దంపతులకు పట్టా పాస్ పుస్తకాలు చూపిస్తూ ఇది ఏంటిది అమ్మ అని అడిగారు. దానికి ఆమె ముసి ముసిగా నవ్వుతూ ఇది పట్టా బుక్కు సార్ అన్నది. వెంటనే నవ్వుకుంటూ ఇది నీ పేరు మీదనే ఉన్నది తెలుసునా అని తిరిగి సీఎం అడిగారు. అందుకామే సంతోషంగా నవ్వుతూ ధన్యవాదాలు తెలిపిన చారిత్రక సందర్భం గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ సందర్భంగా నమోదైంది.

దివంగత సాయిచంద్ కు నివాళి అర్పించిన సీఎం కేసీఆర్
ప్రగతి నివేదన సభా వేదిక పై తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్, దివంగత సాయిచంద్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి సమర్పించి, నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, దివాకర్ రావు, జోగు రామన్న, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపూరావు, దుర్గం చిన్నయ్య, రేఖానాయక్, మాజీ ఎంపి నగేష్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్మన్ భాగ్యలక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్, జడ్పీ ఛైర్ పర్సన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *