కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వము:భట్టి విక్రమార్క

కొండలు, గుట్టలు, రోడ్లకు
రైతుబంధు ఇవ్వము:భట్టి

హైదరాబాద్, మార్చి 9 (విశ్వం న్యూస్) : బీఆర్​ఎస్​ సర్కార్​తో పోలిస్తే, ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు ను తొందరగానే ఇస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే బడ్జెట్​లో సంక్షేమ పథకాలకు రూ.53,196 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈనెల 12న మహిళలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడూ మొదటివారంలో జీతాలు ఇవ్వలేదని దుయ్యబట్టారు.

కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులందరికీ మార్చి 1న జీతాలు ఇచ్చామని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 3,500 మందికి ఇళ్లు ఇస్తున్నామని వెల్లడించారు. యాసంగి రైతుబంధు 4 నెలలలోపు కంటే తక్కువ సమయంలో ఎప్పుడూ ఇవ్వలేదని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *