రంకెలు వేయడం కాదు…
హామీలను నిలబెట్టండి!

- మహిళల సమస్యలపై
సీఎం రేవంత్ చర్చకు సిద్ధమా?–
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 10 (విశ్వం న్యూస్): తెలంగాణ రాజకీయాల్లో తాజాగా మరో కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా నిలదీశారు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలంటూ రోజూ రేవంత్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు ప్రజలకు అవసరమైన విషయాలను దారి మళ్లించేందుకేనని వ్యాఖ్యానించారు.
“మేము మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి వస్తాం. మహిళలకు నెలకు ₹2,500 ఇవ్వాలన్న హామీ ఏమైనా జరిగిందా? తులం బంగారం ఎక్కడ ఉంది? పింఛన్లు ఎందుకు పెరగడం లేదు?” అంటూ వరుస ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ప్రశ్నల గోడదూకించారు.
ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ —
“డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి. ప్రజల అసలు సమస్యలపైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. మహిళల భద్రత, సంక్షేమం వంటి అంశాలపై చర్చకు సిద్ధమవ్వాలి. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా రావరా అనేది మాకేమీ ముఖ్యం కాదు… మీరు హామీలు నిలబెట్టుకుంటారా లేదా అనేదే ప్రధానమైంది.”
ప్రజలు బురిడీ కొట్టే రోజులు గడిచిపోయాయని, ప్రతి మోసం ప్రజల కళ్లకు బట్టిపోతుందని ఆమె హితవు పలికారు. ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న అసంతృప్తిని ఆమె ఈ సందర్భంగా స్పష్టంగా వ్యక్తపరిచారు.