దొర గారి మూర్ఖత్వం

దొరగారి మూర్ఖత్వం

  • తెలంగాణ సగటు మనిషి ఆవేదన

హైదరాబాద్, మార్చి 17 (విశ్వం న్యూస్) : త్యాగాలను మరిచి, ద్రోహులను వలచి తెలంగాణ సమాజాన్ని”బాంచన్ దొరా! నీ కాళ్ళు మొక్కుతా” అనే గత కాల శిధిలాలకు తీసుకుపోవాలనుకోవడం మూర్ఖత్వం దొరా! చైతన్య నారాయణ మేఘాలు కమ్ముకొని మైహోం రామోజీలతో గుబాళిస్తున్న గులాబీ పరిమళాలు ఎప్పటికి త్యాగాల తెలంగాణ చరిత్రను తాకలేవు దొరా! నువ్వు జై తెలంగాణ అన్నప్పటినుండి నీ వెంటే నడిచినం. నిన్నుఆంద్రోడని అంటుంటే నిందను తిప్పికొట్టి నిలబెట్టినం. రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిన్ను అవమానిస్తే మేం అవమానభారంతో రగిలిపోయినం. నువ్వు ఉపఎన్నికలు తెస్తే నీ గెలుపుకై మేం చెమటోడ్చినం. లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలింసిటీని దున్నుతానంటే ఆంధ్ర పెత్తందారుల వెన్నులో వణుకు పుట్టించినవు అనుకున్నం. నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆంధ్ర వలస పాలకుల గుండెల్లో మేం అగ్గై మండినం. నిన్ను బ్రతికించుకొనేందుకు మేం పెట్రోలు మంటల్లో కాలినం. జై తెలంగాణ అంటూ గులాబీ జెండెత్తినం- త్యాగాల బాటలో తెగించి పోరాడినం. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటే నీ కంటే సామాజిక వాది లేడనుకున్నం. తెలంగాణాకు కాపలా కుక్కలా వుంటానంటే నీలాంటి త్యాగి దొరకడనుకున్నం. మూడెకరాల భూమి ఇస్తానంటే దళితులకు నువ్వే పెద్దదిక్కనుకున్నం. కులసంఘ భవనాలు కట్టిస్తానంటే బడుగు వర్గాల ప్రతినిధివనుకున్నం. లక్ష ఉద్యోగాలు ఇస్తానంటే నిరుద్యోగుల ఆశాకిరణం అనుకున్నం. మాట తప్పను మడమ తిప్పను తల నరుకుంటానంటే సత్యహరిచంద్రుడనుకున్నం. మా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నీ పంటితో పీకుతానంటే అత్యంత ఆప్తుడనుకున్నం. జయశంకర్ సార్ కాళ్ళకు దండం పెడితే గొప్ప సంస్కారవంతుడనుకున్నం. బంగారు తెలంగాణ చేస్తానంటే సంబరపడినం. బర్రెలు గొర్రెలిస్తుంటే పేదల పెన్నిధివనుకున్నాం దొరా! ఐదేండ్లకు నీ అసలు రూపం ఎరుకైంది దొరా! నాజీలకు పెద్దన్నవని , నిజాం నవాబుకు వారసుడవని తెలిసింది దొరా! తంతామన్నోళ్ళను మంత్రులను చేస్తావని మేం కలగనలేదు దొరా! నమ్మినోళ్ళను నట్టెట్ల ముంచి మోసాగాళ్లనే మోస్తావని మాకర్థమైంది దొరా! చీమలను తరిమేసి పాములను పెంచుతావని, కాకులను గొట్టి గద్దలకు పంచుతావని తెలిసింది దొరా! ఆసరా ఫించన్లతో మా బతుకుల్లో ఆశలు రేపినవు దొరా! కళ్యాణ లక్ష్మితో మాకళ్లకు గంతలు కట్టినవు దొరా! మిషన్ భగీరథ, కాకతీయాలతో మాచెవులు కుట్టినవు దొరా! రైతు బంధుతో రాబందులను ఎగదోసినవు దొరా! ప్రజా రవాణాపై పగపట్టినావు దొరా! తెలంగాణా మట్టి మనుషుల త్యాగాల చరిత్రను అపహాస్యం చేయబడితివి దొరా! తెలంగాణ ఉద్యమ త్యాగాలను యాది మరచి, చేసుకున్న బాసలన్నీ విడిచిపెట్టి ప్రజలపై పంతానికి దిగుతున్నవు. ఆర్టీసీ కార్మికులను రాచి రంపానబెట్టినావు . సమ్మెపై ఉక్కుపాదం మోపి నీ కంటే గొప్ప నియంత లేడని నిరూపించుకున్నావు దొరా! అరెస్టులు- నిర్బంధాలతో, కుట్రలు-కుతంత్రాలతో ప్రశ్నించే ప్రజా గొంతుకలును మూయిస్తున్నావు దొరా! గొంతులు మూయించినంత మాత్రాన ప్రశ్న మూగబోతుందా?! పోరాటం ఆగుతుందా దొరా?!! ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు చచ్చినా నీకు చీమ కుట్టలేదు దొరా! కనికరం లేని కరకు రాతి గుండె మీది దొరా! శబాష్ దొరా! ఇప్పటికైతే మీరెంత చెబుతే గంతే దొరా! మీరేది చెబితే గదే దొరా! కానీ మంచి మనసుతో ఒక మాట చెబుతా జర వినుకొండి దొరా! చరిత్ర సాక్ష్యం చెబుతుంది దొరా! కాల గమనంలో రాజులు రాజ్యాలే కనుమరుగైనాయి, కోటగోడలు కూలిపోయినాయి, నియంతల కలలు కల్లలుగానే మిగిలిపోయి శిధిలమైనాయి. నేడు ఆ శిధిలాలపై ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు జెండాలై, ఎజెండాలై రెపరెపలాడుతూ యథేచ్ఛగా ఎగురుతున్నాయి దొరా! వాటిని ఆపడం, అణచడం ఎవరి తరమూ గాదు, నీతరమూ అసలు గాదు దొరా ! తెలంగాణా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను ఆపటం ఎవరి తరమైంది దొరా ? చరిత్రకు సాక్ష్యం ప్రజలే! చరిత్రకు ఆద్యులు ప్రజలే! చరిత్ర నిర్మాతలు ప్రజలే! నువ్వో – నేనో కాదు దొరా! గిది తెలుసుకుంటే మంచిది దొరా! లేకుంటే ఆకాశానికి ఎత్తిన జనం, అధః పాతాళానికి తొక్కడం ఖాయం దొరా! ఇంకెంతో సమయం లేదు దొరా! అధికారం ఒక మత్తు, అదో గమ్మత్తు. అందులో పడి ఆగం కావద్దని తెలుసుకో దొరా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *