నష్ట పోయిన ప్రతి రైతును
తక్షణమే ప్రభుత్వం
ఆదుకోవాలి:ఈటెల డిమాండ్
నిర్మల్, జూలై 31 (విశ్వం న్యూస్) : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ వరదలతో సర్వం కోల్పోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈరోజు నిర్మల్ లో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముధోల్ భాజపా నాయకులు పవార్ రామారావు పాటిల్ గారి తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని గత సంవత్సర వరదల వల్ల ఏర్పడ్డ పంట నష్టపరిహారాన్ని ఇప్పటికీ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి రైతుల బాగు కోసం తీసుకువచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రైతాంగ వ్యవసాయం గురవుతుందని పేర్కొన్నారు. రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ఫసల్ బీమా యోజన వాట కట్టకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారని పేర్కొన్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజానీకానికి సహాయం అందించడంలో అధికార యంత్రాంగం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలకు కావలసిన నిత్యవసరాలు సరుకులను పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి సమకూరుస్తున్నారు తప్ప ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ఉత్త చేతితో పర్యటిస్తున్నారు తప్ప వారికి సహాయ సహకారాలు అందించడం లేదని ఆరోపించారు. వరదల ద్వారా ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి తక్షణ సాయం కింద సరుకుల కొరకు 25000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల ద్వారా సర్వం కోల్పోయిన రైతులను ప్రజానీకాన్ని ఆదుకొనట్లయితే భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీరితోపాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పార్లమెంట్ ప్రభారి అల్జాపూర్ శ్రీనివాస్, పార్లమెంటు ఇంచార్జ్ అయ్యన్న గారి భూమయ్య, మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.