ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

సీనియర్ సివిల్ జడ్జ్ కం అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ ఎం.అర్జున్
పెద్దపల్లి, జనవరి 21 (విశ్వం న్యూస్) : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జ్ కం అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ ఎం. అర్జున్ తెలిపారు. శనివారం స్థానిక గాయత్రి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ కం అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ ఎం.అర్జున్ పాల్గొని విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సీనియర్ సివిల్ జడ్జ్ ఎం.అర్జున్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వారి హక్కులపై, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారం సులువుగా ఎలా పొందాలనే విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని తెలిపారు.
విద్యార్థినులు తాము భవిష్యత్తులో ఏమి కావాలి, ఎలా వుండాలి అనేది నిర్ణయించుకొని లక్ష్యాన్ని సాధించేలా కృషి చేయాలని, సమయాన్ని అనవసర పనులకు వృధా చేయరాదని, ఫోన్ లో ఛాటింగ్, మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని, తమ సమాచారం తెలియని వారికి షేర్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్ లో టోల్ ఫ్రీ నంబర్ లను కలిగి ఉండి అవగాహన కలిగి ఉండాలనీ తెలిపారు. సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఇది చట్టాలపై కనీస పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడే సాధ్యమౌతుంది అని తెలిపారు. జిల్లా, మండల స్థాయి లీగల్ సర్వీసెస్ లో తమ సమస్యను ఒక తెల్ల కాగితంపై రాసి న్యాయ సేవలు, సహాయం పూర్తిగా ఉచితంగా పొందవచ్చని సూచించారు. చట్టాలపై, హక్కులపై అవగాహన కలిగి సమాజానికి ఉపయోగపడే విధంగా, తమ ప్రక్కన ఉన్న వారికి చేయూత నందించాలని, కుటుంబ గౌరవం పెంపొందెలా లక్ష్యసాధన వైపు అడుగులు వేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు.

ఈ సందర్భంగా సబ్ జడ్జ్ గృహ హింస, వరకట్న నిషేధ చట్టం, సమాచార హక్కు చట్టం, వినియోగదారుల హక్కు చట్టాలపై అవగాహన కలిగిస్తూ, బ్యాంకుల్లో అదనపు ఛార్జ్, సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కొరకు అంబడ్స్మెన్ ను సంప్రదించాలని, విద్యార్థినులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన అడ్వకేట్ లు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు.
మహిళా ఎస్సై మౌనిక మాట్లాడుతూ, చదువు పూర్తి అయ్యేలోగా మనం కుటుంబానికి, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాము అని ఆలోచించాలని, మహిళలకు సమాజంలో సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బందులు లేకుండా ఎదుర్కొనేలా పోలీస్ శాఖ ద్వారా అన్ని శాయ సహకారాలు అందిస్తున్నట్లు, ప్రతి ఒక్కరూ టోల్ ఫ్రీ నంబర్ లను గుర్తు పెట్టుకోవాలని, ఈ సందర్భంగా సఖి ద్వారా అందించే సేవలను, హక్ ఐ యాప్ ఫోన్ లో ఎలా ఉపయోగించాలి అనే విషయంపై వివరించారు.
ఈ కార్యక్రమంలో గాయత్రి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జే. రవీందర్, మహిళా ఎస్.ఐ. మౌనిక, అడ్వకేట్ హనుమాన్ సింగ్, డి.వి.ఎస్. మూర్తి, కోర్టు సిబ్బంది, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *