సౌదీలో ఘోర బస్సు ప్రమాదం – 42 మంది సజీవ దహనం: హైదరాబాద్‌కు చెందిన 18 మంది

నవంబర్ 17 (విశ్వం న్యూస్) : సౌదీ అరేబియాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన దారుణ బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మక్కా నుంచి మదీనాకు బయల్దేరిన యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ట్యాంకర్ నుంచి ఎగిసిన మంటలు క్షణాల్లోనే బస్సును చుట్టుముట్టడంతో పలువురు ప్రయాణికులు బయటపడే అవకాశం కూడా లేకపోయింది.
ప్రమాదంలో 42 మంది సజీవ దహనం అయినట్లు అక్కడి అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. మృతుల్లో 21 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉండటం ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. ప్రమాద తీవ్రత అంతగా ఉండటంతో బస్సు పూర్తిగా కాలిపోయి, మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితికి చేరాయి.

అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, హైదరాబాద్‌కు చెందిన 18 మంది యాత్రికుల బృందం కూడా ఈ బస్సులో ఉన్నారని సమాచారం కుటుంబాల్లో ఆందోళన రేపుతోంది. ప్రాణాలతో బయటపడిన ఒక వ్యక్తి ధృవీకరించిన వివరాల ప్రకారం, యాత్రికులు మక్కాలో ఉమ్రా పూర్తి చేసుకుని మదీనాకు ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేస్తూ, DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు కూడా సౌదీ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.













