మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం

మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద
భారీ అగ్నిప్రమాదం.. బైకులు దగ్ధం

హైదరాబాద్, డిసెంబర్ 6 (విశ్వం న్యూస్) : హైదరాబాద్లోని మలక్పేట మెట్రో స్టేషన్ కింద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం (డిసెంబర్ 06న) మధ్యాహ్నం సమయంలో జరిగిన ప్రమాదంలో.. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన ద్విచక్రవాహనాలు పూర్తిగా తగలబడిపోయాయి. మెట్రో స్టేషన్ మెట్ల కింద పార్కింగ్ చేసిన వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకోవటంతో.. ప్రమాదం జరిగింది. అగ్నికీలలు ఎగిసిపడటంతో పాటు పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. దట్టంగా అలముకున్న పొగతో మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. భారీగా ఎగిసిపడిన మంటలను చూసి.. రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు, స్థానికులు భయందోళనలతో పరుగులు తీశారు.

మలక్పేట మెట్రో పిల్లర్ నెంబర్- 1409 వద్ద ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మెట్రో స్టేషన్ దగ్గర పార్క్ చేసి ఉంచిన 5 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంతో మలక్పేట- దిల్సుఖ్నగర్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా చాదర్ఘాట్ నుంచి మలక్పేటకు వెళ్లే వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

మరోవైపు.. అక్కడ పార్క్ చేసిన ద్విచక్రవాహనాల్లో ఏదైన ఎలక్ట్రిక్ వాహనం ఏదైనా ఉందా అనేది కూడా పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *