మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

హైదరాబాద్, డిసెంబర్ 27 (విశ్వం న్యూస్) : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పని చేశారు. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రధానమంత్రి పదవిని వీడిన తర్వాత మన్మోహన్ సింగ్ తన భార్యతో నివసిస్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, భార్య గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలు..!!
డాక్టర్ మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932న ఉమ్మడి భారతదేశంలో పంజాబ్ లోని ప్రావిన్స్ లో (ప్రస్తుతం పాకిస్తాన్ లో భాగంగా ఉంది) జన్మించారు.. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. 1957లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని నఫీల్డ్ కళాశాల నుంచి అర్థశాస్త్రంలో డి.ఫిల్ చేశారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా తన వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చారు. 1960లో భారతదేశంలోని విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుగా పనిచేశారు. 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని స్థాయికి చేరుకున్నారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా చేరారు తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా, ప్రధానమంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా ఏ పదవిలో చేరిన అక్కడ తన బెస్ట్ ఇవ్వడం మన్మోహన్ సింగ్ కే చెల్లింది. మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా పని చేశారు. అప్పుడే అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అవి నేటికి ఆదర్శంగా మారాయి. 2004 లో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. 2009లో రెండవసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
