ముస్లిం సహోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షలద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో, ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సిఎం కోరుకున్నారు. అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలని సిఎం కేసీఆర్ ప్రార్థించారు.

గంగా జమునా సంస్కృతికి తెలంగాణ నేల ఆలవాలమని, లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే కట్టుబడి వుందని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
విద్య, ఉపాధి తో పాటు పలు రంగాల్లో ఆసరానందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు భరోసాగా నిలిచిందన్నారు. వారి జీవితాల్లో గుణాత్మక మార్పుకోసం అమలు చేస్తున్న పలు పథకాలు ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. స్వయం పాలనలో గడచిన తొమ్మిదేండ్ల కాలంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం రాఫ్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 13 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నదని సిఎం కేసీఆర్ వివరించారు.

మైనారిటీల అభివృద్ధికోసం అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రగతి కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి కొనసాగుతూనే వుంటుందని సిఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న ముస్లిం మైనారిటీ అభివృద్ధి మోడల్ ను దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *