మీరు అద్దం తునక చేస్తే
మేము అడ్డం పడుతున్నామా

- సమస్యలు చెప్పుకున్నది మాకార్యకర్తలు కాదు ప్రజలు
- ఆర్&బి ఈఈ ద్వారా వచ్చిన ప్రకటనకు ఎందుకు కట్టుబడి లేరు రాత్రి కి రాత్రి ఎందుకు పనులు చేస్తుండ్రు
- నాణ్యత లోపం లేక పోతే భారీ వాహనాలను ఎందుకు నియంత్రిస్తున్నారు
- నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్
కరీంనగర్ బ్యూరో, జూలై 30 (విశ్వం న్యూస్) : కరీంనగర్ అద్దం తునక అయ్యింది అనవసరంగా ప్రతి పక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మేయర్ సునీల్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలవల్ల నగరంలో చాలా ప్రాంతాలలో ఇండ్లల్లోకి నీళ్ళు చేరాయని తెలిసి వెళ్లి పరిశీలించి మీడియా ద్వారా తెలియజేస్తే కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని సునీల్ రావు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.సమస్యలు చెప్పుకున్నది కాంగ్రెస్ కార్యకర్తలు కాదని స్థానిక ప్రజలను నరేందర్ రెడ్డి అన్నారు.
కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కుంగలేదని కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్దాంతం చేస్తుందని అనడం సిగ్గు చేటన్నారు. రోడ్లు భవనాల శాఖ ఈఈ ఇచ్చిన ప్రకటనలో రెండు మూడు సెంటి మీటర్లు మాత్రమే కుంగింది ఇది సహజం అని ఒక వర్షాకాలం పూర్తిగా చూసిన తర్వాత తారు వేస్తామని పేర్కొని ఎందుకు రాత్రికి రాత్రి మరమ్మతుల పనులు చేస్తున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి గంగుల కమలాకర్ కు చిత్తశుద్ధి ఉంటే నాణ్యత పై నమ్మకం ఉంటే విజిలెన్స్ కు ఫిర్యాదు చేయమని డిమాండ్ చేస్తున్నామన్నారు. వాహనాలను ఎప్పటిలోగా అనుమతిస్తారో స్పష్టత ఇవ్వాలని తాత్కాలిక మరమ్మతులు చేసి ఎన్నికల వరకు కేవలం చిన్న వాహనాలకు మాత్రమే అనుమతించి ప్రజల దృష్టి మళ్ళించాలని చూస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు.
ఈ విలేఖరుల సమావేశంలో ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దండి రవీందర్, కుర్ర పోచయ్య, ఎండి చాంద్,దన్న సింగ్, షబానా మహమ్మద్, ఊరడి లత, ముల్కల కవిత, అన్నే జ్యోతి రెడ్డి, ముక్క భాస్కర్, చంద్రయ్య గౌడ్, సలిమోద్ధిన్, మామిడి సత్యనారాయణ రెడ్డి, కంకనాల అనిల్ కుమార్, మెతుకు కాంతయ్య,షేక్ శేహెన్ష, మహమ్మద్ భారీ, ఇమామ్, కీర్తి కుమార్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.