Today TrendingVishwam Newsఆంధ్రప్రదేశ్జాతీయంతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

కేంద్ర బడ్జెట్లో బి.సిలకు మొండి చేయి

కేంద్ర బడ్జెట్లో బి.సిలకు మొండి చేయి

కేంద్ర ప్రభుత్వం బి.సి వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విశ్వం న్యూస్) : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన 39 లక్షల 45వేల కోట్ల బడ్జెట్ లో బీసీలకు కేవలం 1400 కోట్లు మాత్రమే కేటాయించి దేశంలోని 70 కోట్ల మంది బీసీలను అవమాన పరిచారని ,దగా చేశారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఈ బడ్జెట్ తో బీసీలకు కనీసం బిస్కెట్ లు కూడా రావన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో బిసిలకు 74 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆరోపించారు. దేశ సంపద సృష్టిలో బిసిల పాత్ర అమితంగా ఉన్నా, సంపదలో వారికి వాటా కల్పించరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బిసిలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించమని పలుమార్లు ప్రధానమంత్రి మోదీకి, పలు కేంద్ర మంత్రులకు విన్నవించినా కేంద్రానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని వ్యాఖ్యానించారు .
కేంద్ర ప్రభుత్వం తన బిసి వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోకపోతే బిసిలంతా ఏకమై పార్లమెంట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా బడ్జెట్ లో బిసిలకు అన్యాయం జరిగిందని, బిసి ప్రధాని అయితే బిసిలకు న్యాయం జరుగుతుందని తాము అనుకున్నప్పటికీ , మోడీ పాలనలో నేటికీ అన్యాయం, వివక్ష కొనసాగుతున్నదని ఆరోపించారు.
దేశంలోని 6వేల బిసి కులాలను ఆదుకునేలా బడ్జెట్ ను పున: సమీక్షించాలన్నారు. జీఎస్టీ రూపంలో దేశ ఉత్పత్తి, సేవా పన్నుల రూపంలో ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నామని కేంద్రం చెబుతున్నా , ఈ విధానాలు కేవలం కార్పోరేట్, సంపన్న వర్గాలకు మాత్రమే మేలు చేకూర్చే విధంగా ఉన్నయే తప్ప, సంపద సృష్టిస్తున్న బడుగు జీవులకు ఒరిగిందదేమి లేదన్నారు.
దేశంలో కులవృత్తులనే నమ్ముకుని జీవనం కోనసాగిస్తున్న బిసిల పరిస్థితులు రోజు రోజుకు దయనీయంగా మారుతున్నాయని ఆరోపించారు. ఉత్పత్తి, సేవా రంగాలను ఆసరా చేసుకుని జీవనం సాగిస్తున్న బడుగు జీవులు నేటికీ ఆకలి చావులు, ఆత్మహత్యలకు లోనవుతున్నారని మండిపడ్డారు. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, లేదంటే కులవృత్తులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కులవృత్తి దారులు తయారు చేసే పాలు, మాంసం, వ్యవసాయ ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, నగిషీలు, నగలు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్స్ పోర్ట్ వ్యవస్థను గ్రామీణ వ్యవస్థలకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చి దేశీయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ వ్యవస్థలతో అనుసంధానం చేసి దళారులను నిలువరించి నిజమైన ఉత్పత్తి దారులకు అండగా నిలవాలన్నారు. వంట నూనెలు, పెట్రోల్, డిజిల్ తో పాటు ఇతర నిత్యావసర ధరలు ఈ బడ్జెట్లో పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాల ఆశలు గల్లంతయ్యాయని తెలిపారు . సొంతిల్లు, కార్లు సామాన్యులకు కలగానే మిగిలిపోయిందని అన్నారు. తక్షణమే ఈ బడ్జెట్ ను పున సమీక్షించి, కేంద్రంలో ప్రత్యేక బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, లక్ష కోట్ల బడ్జెట్ ను కేటాయించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *