చాకచక్యంగా టైర్ల దొంగలను
పట్టుకున్న జమ్మికుంట పోలీసులు

- అభినందించిన ఏసీపీ జీవన్ రెడ్డి
జమ్మికుంట, ఆగస్టు 26 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మండల పరిసర ప్రాంత గ్రామాల్లో ట్రాక్టర్ల టైర్లు, డెస్క్ లను దొంగిలిస్తు్న్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు హుజురాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి తెలిపారు. జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ రమేష్ తో పాటు ఏసిపి జీవన్ రెడ్డి తెలిపారు.

జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన పురమ శ్రీనివాస్, నెల్లి వంశీ అనే ఇద్దరు యువకులు జమ్మికుంట కొత్తపల్లిలో టాటా ఏసీ వాహనంలో టైర్ల లోడుతో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మండల పరిధిలోని బిజిగిరి షరీఫ్ లోని రాచపల్లి సమ్మయ్యకు చెందిన రెండు ట్రాక్టర్ల టైర్లు, డెస్కులు, వెంకటేశ్వర పల్లి గ్రామంలోని బోయిని అనిల్ కు చెందిన రెండు ట్రాక్టర్ల టైర్లు, డేస్కులు, అదేవిధంగా ఇల్లంతకుంట మండల పరిధిలోని చిన్న కోమటిపల్లి గ్రామ శివారులో రెండు ట్రాక్టర్ల టైర్లు, డేస్కులు, మల్యాల గ్రామ శివారులో ఉన్న రెండు టైర్లను దొంగిలించినట్లు దొంగిలించిన వ్యక్తులు అంగీకరించినట్లు ఏసిపి తెలిపారు.
ట్రాక్టర్ల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. దొంగలను చకచక్యంగా పట్టుకున్న ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు మోహన్, సదానందం, సురేందర్ లను ఏసీపీ జీవన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.