టాస్క్ ఆధ్వర్యంలో ఈ నెల 9న
ఐటీ ఉద్యోగాల జాబ్ మేళా
- ఐటీ టవర్ లో మొదటి విడతగా 650 ఐటీ ఉద్యోగాల భర్తీ
- వలస పోయే దశ నుంచి ఐటీ ఉద్యోగాలు అందించే స్థాయికి ఎదిగాం
- మొదటి విడతన మహబూబ్ నగర్ నియోజకవర్గ అభ్యర్థులకు అవకాశం
- జిల్లా యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయం
- భవిష్యత్తులో మహబూబ్ నగర్ వరకు మెట్రో తీసుకువస్తాం
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, ఆగస్టు 2 (విశ్వం న్యూస్) : యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించాలన్న ఏకైక ధ్యేయంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఈనెల 9న మహబూబ్ నగర్, శిల్పారామంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఈ అంశంపై మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ జాబ్ మేళా లో సుమారు 10కి పైగా ఐటి కంపెనీలు పాల్గొంటున్నాయని, 9వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా ఉంటుందన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన యువతీ యువకులు ముఖ్యంగా పాలిటెక్నిక్ , డిగ్రీ, ఇంజనీరింగ్ ఆపై చదివిన అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు పాలమూరు అంటేనే కూలీలకు ప్రపంచ ప్రసిద్ధి అని… ఇప్పుడు మహబూబ్ నగర్ లోనే ఐటీ కారిడార్ ఏర్పాటు చేసి ఇక్కడ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను కల్పిస్తున్నామన్నారు. మొదటి విడతన 10కి పైగా కంపెనీలు సుమారు 650 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించనున్నాయని తెలిపారు.
జువన్ టెక్నాలజీస్ ఐ ఎన్ సీ, ముల్లెర్ డాట్ కనెక్ట్, అర్పన్ టెక్, ఐటి విజన్ 360 డాట్ బిజ్, అమర రాజా, భారత్ క్లౌడ్, ఈ గ్రోవ్ సిస్టమ్స్, ఫోర్ వోక్స్, హెచ్ ఆర్ హెచ్ ఆర్ హెచ్ నెక్స్ట్, ఎస్.టు ఇంటిగ్రేటెడ్ ఐ ఎన్ సీ, తదితర మల్టీ నేషనల్ కంపెనీలు ఐటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రారంభ దశలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులకు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది అమర రాజా ద్వారా మరో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. హన్వాడలో ఫుడ్ పార్కును సైతం ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. చదువుకున్నవారందరితో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ అభిమతమని తెలిపారు.
మహబూబ్ నగర్ కు మెట్రో రైలు…
మహబూబ్ నగర్ లో ఐ టి కారిడార్ ఏర్పాటు కావడం, జాతీయ రహదారి, శంషాబాద్ విమానాశ్రయం దగ్గరలో ఉండడం ఈ ప్రాంత అభివృద్ధికి సూచికలన్నారు. షాద్ నగర్ వరకు ఏర్పాటు కానున్న మెట్రో రైలు సేవలను భవిష్యత్తులో మహబూబ్ నగర్ ఐటీ పార్క్ వరకు విస్తరించి పట్టణ వాసులకు కూడా మెట్రో సౌకర్యం కల్పిస్తామన్నారు. మెట్రో వస్తే ఐటీ టవర్ నుంచి ఎయిర్పోర్ట్ కు 30 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపారు. మహబూబ్ నగర్ ను మహా నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ టవర్ నుండి మహబూబ్ నగర్ పట్టణం వరకు 100 ఫీట్ల బైపాస్ రహదారి త్వరలో పూర్తి చేయనన్నామని ఆయన అన్నారు.
గతంలో మహబూబ్ నగర్ లో ఒక్క పెద్ద పరిశ్రమ కూడా ఉండేది కాదని… కాటన్ మిల్ ఉన్నా అది మూత పడిందన్నారు. బతుకుదెరువు కోసం తప్పనిసరిగా ఊరు విడిచి వెళ్లాల్సిన దుస్థితి ఉండేదని దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఐటి టవర్ తో పాటు పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడి వారికి ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ఐటి కారిడార్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ఐటీ కలువుల జాబ్ మేళా ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో భారీగా ఉద్యోగాల కల్పన చేపడుతామన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని గమనించి మేధావులు, ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, టాస్క్ డైరెక్టర్ ప్రదీప్, రాష్ట్ర ప్రభుత్వ ఐటి ఇన్వెస్ట్ సీఈవో విజయ్ రంగినేని, జిల్లా ఎస్పీ కే. నరసింహ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.