ఈడీ కార్యాలయానికి కవిత
కవిత అరెస్ట్ అవుతోందంటూ వార్తలు…
ఢిల్లీ, మార్చి 20 (విశ్వం న్యూస్) : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ లింక్ మనీ లాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవిత సోమవారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట రెండో రౌండ్ విచారణకు హాజరయ్యారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఈ నెల 11వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆ రోజు దాదాపు 9 గంటల పాటు విచారించిన ఈడీ.. ఈ నెల 16వ తేదీన మళ్లీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవిత.. పిటిషన్ పెండింగ్‌లో ఉందనే సాకుతో ఈ నెల 16న విచారణకు డుమ్మా కొట్టారు. అయినప్పటికీ ఈ నెల 20 విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ అవుతోందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ్టి విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది.